Jun 23,2022 22:12
  • సాయంత్రం అరు గంటలకు 64.14 శాతం - 26న కౌంటింగ్‌
  • వైసిపికి లక్ష ఓట్ల మెజార్టీ లభించే అవకాశం!

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరిగింది. అప్పటికే క్యూలో ఉన్న వారికి సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. సాయంత్రం ఆరు గంటలకు 64.14 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 2,13,330 మంది ఓటర్లలో 1,37,038 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం ఆరు గంటల తరువాత కూడా క్యూలైన్లో ఉన్న వారు ఓటు హక్కు వినియోగించుకున్నా అతి తక్కువ పోలింగ్‌ జరిగే అవకాశం ఉంది. మొత్తం 279 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 140 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ శాతాన్ని పెంచడానికి అధికారులు ఏర్పాట్లు చేసినా పెద్దగా ఫలితం రాలేదు. వైసిపి అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం మందకొడిగా ఓటింగ్‌ ప్రారంభమైంది. తొమ్మిది గంటలకు 11.56 శాతం, 11 గంటలకు 24.92 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 44.14 శాతం, మూడు గంటలకు 54.66 శాతం, సాయంత్రం ఐదు గంటలకు 61.70 శాతం, ఆరు గంటలకు 64.14 శాతం నమోదైందని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల సాయంత్రం ఆరు గంటల తరువాత ఓటర్లు కేంద్రాల వద్ద ఉండడంతో ఓటింగ్‌ కొద్ది శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో 82.44 ఓట్లు పోలయ్యాయి. గురువారం రాత్రి వివిధ మండలాలను నుంచి ఆత్మకూరు పట్టణంలోని ఇంజినీరింగ్‌ కాలేజీకి ఇవిఎంలు చేరాయి. అధికారులు వాటిని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రంగా ఉంచారు. ఈ నెల 26న కౌంటింగ్‌ జరగనుంది. వైసిపికి లక్ష ఓట్ల మెజార్టీ దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.