
న్యూఢిల్లీ : మహిళ మహా పంచాయత్‌ను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కాప్ నేతలు మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజునే రెజ్లర్లకు మద్దతుగా మహిళ మహాపంచాయితీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రెజ్లర్లపై లైంగి వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ (డబ్ల్యుఎఫ్‌ఐ) బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలంటూ గత 31 రోజులుగా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపడుతున్నారు. అలాగే మే 28న శాంతియుతంగా మహిళ మహా పంచాయత్‌ను చేపట్టాలని నిర్ణయించినట్లు ఢిల్లీలోని ప్రముఖ కాప్ -360 పాలం కాప్ చీఫ్ సురేంద్ర సింగ్ సోలంకి పేర్కొన్నారు. దీంతో ప్రజలు వేదిక ప్రాంతానికి చేరుకోకుండా అడ్డుకోవద్దని ఢిల్లీ పోలీసులు, కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రజలను అడ్డుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుదని, అందుకే అధికారులే బాధ్యత వహించాల్సి వుంటుందని హెచ్చరించారు.
రెజ్లర్లకు కాప్ పంచాయితీలతో పాటు వివిధ వ్యవసాయ సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. మహిళ మహా పంచాయిత్‌కు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానిస్తూ.. గురువారం ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సివాచ్ కాప్ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు దేవికా శివాచ్ కూడా హాజరయ్యారు. మే 28న అన్ని వ్యవసాయ సంఘాలు, కాప్ నేతలు రెజ్లర్లకు అండగా నిలుస్తాయని కిసాన్ సర్కార్ జాతీయ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర హుడా అన్నారు. మహిళ మహా పంచాయత్‌కు సంఘీభావం తెలిపేందుకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు ఢిల్లీ కి చేరుకుంటారని అన్నారు. ప్రజలు ఢిల్లీకి రాకుండా ఆపితే అధికారులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు.