Jul 29,2021 19:26

matladutunna sp

అవినీతిని ఉపేక్షించేది లేదు : సిద్ధార్థ్‌ కౌశల్‌
హెడ్‌ కానిస్టేబుల్‌ సస్పెండ్‌
ప్రజాశక్తి-కలక్టరేట్‌
పోలీస్‌ శాఖలో పనిచేసే సిబ్బంది అంతా శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా, కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే లా ప్రవర్తిస్తే వారు ఏ స్థాయి అధికారైన శాఖాపరమైన చర్యలకు వెనుకాడేది లేదని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ స్పష్టంచేశారు. అవినీతి ఆరోపణలు, ప్రజలతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు అన్న ఆరోపణలతో పామర్రు పోలీస్‌ స్టేషన్‌లో రైటర్‌ గా విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ రాజులపాటి కిషోర్‌ను సస్పెండ్‌చేశామన్నారు. కొద్ది రోజుల క్రితం పామర్రు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బల్లిపర్రు హైవే వద్ద ఒక కారు, ద్విచక్ర వాహనం రహదారి ప్రమాదం లో ఢకొీన్న సంఘటనలో క్షతగాత్రులైన వారు పోలీస్‌ స్టేషన్‌ కు ఫిర్యాదు చేయడానికి రాగా, ఎస్సై వారి ఫిర్యాదు స్వీకరించమని చెప్పినప్పటికీ, ఆ వచ్చిన వారి ఫిర్యాదును స్వీకరించకపోగా, వారి పట్ల అమర్యాదగా, అసభ్యకరంగా మాట్లాడుతూ, వారి మనోభావాలను కించపరిచేలా ప్రవర్తించినట్లు ఎస్పి దష్టికి వచ్చింది. ఆ సంఘటనపై సంబంధిత అధికారులకు ఎస్పీ పూర్తి విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరిపి న అధికారులు నివేదికను ఎస్పీకి సమర్పించగా, వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్దారణ కావడంతో అతన్ని సస్పెండ్‌ చేస్తూ జిల్లా పోలీస్‌ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు. ఇవే కాక పలు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కూడా రుజువైనట్లుగా తేలిందన్నారు. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్‌ ను అందించాలి కానీ ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌ ను ఆశ్రయించే ప్రజల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిసిన, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పబోవని ఎస్పీ హెచ్చరించారు.