Jul 29,2021 20:25

ఎమ్మెల్యేకోలగట్లను మర్యాదపూర్వకంగా కలిసిన స్వాతీరాణి, గణేష్‌

విజయనగరంటౌన్‌ : రాష్ట్రంలో అవసరమైన చోట్ల గిరిజన సహకార స్టోర్లు ఏర్పాటు చేయనున్నట్టు జిసిసి చైర్మన్‌ శోభా స్వాతీరాణి తెలిపారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞత తెలిపారు. అనంతరం కోలగట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ, వైసిపి బలోపేతానికి కషి చేయాలని అన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులను జిసిసి ద్వారా ప్రజలకు అందించడంలో కొంత వెనుకబడి ఉందన్నారు. దీనికి సంబంధించి లోటుపాట్లను గుర్తించి, జిసిసిని అభివద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. సిఎం జగన్మోహన్‌ రెడ్డి గిరిజనులకు, మహిళలకు పెద్దపీట వేశారన్నారు. వారికి తప్పక రుణపడి ఉంటామన్నారు. 15ఏళ్లుగా జిసిసికి చైర్మన్‌ లేకపోవడంతో వెనుకబడి ఉందన్నారు. అరకు వ్యాలీ కాఫీకి మంచి డిమాండ్‌ ఉందని, స్టోర్స్‌ను ఏర్పాటు చేసి మార్కెటింగ్‌ కూడా పెంచే ఆలోచనలో ఉన్నామన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, స్వాతీరాణి భర్త గణేష్‌ ఉన్నారు.
ఎమ్మెల్యే బొత్సను కలిసిన స్వాతీరాణి
జిసిసి చైర్మన్‌గా ఎన్నికైన శోభా స్వాతీరాణి గురువారం గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్యను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అప్పలనర్సయ్య మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించి వారికి నమ్మకం కలిగించేలా పనిచేయాలని ఆకాంక్షించారు.