Nov 25,2022 16:09

ప్రజాశక్తి-కోడూరు : వ్యాధుల బారిన పడ్డ రోగాలను చిన్న చూపు చూడకూడదని వ్యాధుల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని మచిలీపట్నం అసిస్టెంట్ మలేరియా అధికారి  పి.ఎస్ రాజు అన్నారు. కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని స్వతంత్రపురం గ్రామంలో గల శ్రీ చామర్తి ప్రకాశరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధుల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మచిలీపట్నం అసిస్టెంట్ మలేరియా అధికారి  పి.ఎస్ రాజు పాల్గొని మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్,  హెచ్ఐవి, ఎయిడ్స్, మద్యపానం సేవించడం వలన కలిగే అనర్ధాలు, ఆహార కలుషితము, నీటి కలుషితం వలన కలిగే అనర్ధాలు, తల్లి నుండి బిడ్డలకు సోకే ఇన్ఫెక్షన్స్ ల గురించి పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆలా వెంకట రమణ  అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయ బృందం పెద్ద సంఖ్యలో విద్యార్థులు  పాల్గొన్నారు.