Jan 23,2022 07:22

న్యూయార్క్‌ : కొత్త సంవత్సరంలో ప్రపంచం అయిదు అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ నొక్కి చెప్పారు. కోవిడ్‌-19, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాతావరణ సంక్షోభం, సైబర్‌ రంగంలో అరాచకం, శాంతి, భద్రత... ఇవే నేడు మనల్ని పీడిస్తున్న అయిదు ప్రధాన సమస్యలని, వీటిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ పూర్తి స్థాయిలో సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో గుటెరస్‌ మాట్లాడుతూ, కొత్త సంవత్సరంలో తమ ప్రాధాన్యతలు ఇవేనన్నారు. కోవిడ్‌ మహమ్మారి ప్రజల ప్రాణాలను, వారి ఆశలను హరించి వేస్తోందని. మనల్ని మరింత అనిశ్చితిలోకి ఇది నెట్టివేస్తోందని, మరోవైపు అసమానతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. వాతావరణ సంక్షోభం ఉధృతమవుతోంది. కాలుష్యం, జీవ వైవిధ్య నష్టం పెరుగుతున్నాయి. ప్రపంచమంతటా రాజకీయ అశాంతి, ఘర్షణలు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాల మధ్య అపనమ్మకం అంతకంతకూ పెరిగిపోతోంది, విద్వేషాలు, అసత్య ప్రచారాలకు అడ్డు అదుపులేకుండాపోతోంది. వీటిని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ పాలన విఫలమవుతోంది. ఆరోగ్య రంగం నుండి డిజిటల్‌ సాంకేతిక రంగం వరకు ఈనాటి బహుళ పక్ష చట్రాలకు కాలం చెల్లింది. శాంతి, సుస్థిర అభివృద్ధి, మానవ హక్కులు, అందరికీ హోదా, గౌరవం వంటి ప్రజల ఉమ్మడి ఆకాంక్షలను నెరవేర్చేలా ఇవి లేవని గుటెరస్‌ పేర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు గట్టి చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందనినాయన పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరులో ప్రపంచం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. వ్యాక్సిన్లే ప్రాణాలు రక్షిస్తున్నాయి. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ల పంపిణీలోనూ తీవ్ర అసమానతలు నెలకొన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐరాస ఆధ్వర్యంలోని కొవాక్స్‌కు వ్యాక్సిన్ల సరఫరాకు అన్ని దేశాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.