Jul 29,2021 23:24

- రూ.9.85 లక్షల విలువైన పెట్రోలు, డీజిల్‌, కిరోసిన్‌ స్వాధీనం
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్‌పి మల్లికా గార్గ్‌
ప్రజాశక్తి-పంగులూరు: 
జాతీయ రహదారిపై అక్రమంగా పెట్రోలు, డీజిల్‌, కిరోసిన్‌ అమ్ముతున్న 15 మందిపై ఆయా పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్‌పి మల్లికా గార్గ్‌ తెలిపారు. రేణంగివరం పోలీస్‌స్టేషన్‌లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. జాతీయ రహదారిపై పెట్రోలు, డీజిల్‌, తారు, కిరోసిన్‌ అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు. రహదారిపై ప్రయాణించే లారీ డ్రైవర్లు వీటిని మార్టూరు, పంగులూరు, మేదరమెట్ల, మద్దిపాడు, ఉలవపాడు మండలాల్లో ఆయా ప్రదేశాల్లో ఆపి లారీల్లో ఉన్న ఆయిల్‌ను అమ్మి, అతి తక్కువ ధర ఉన్న కిరోసిన్‌ను నింపుకుని వెళ్తున్నారని అన్నారు. అక్రమంగా ఆయిల్‌ తీసుకున్న స్థానిక లారీ యూనియన్‌ మెంబర్లు, వాహన యజమానులు అసలు ధర కంటే తక్కువ ధరకు ఆయిల్‌ను అమ్ముతుంటారని వివరించారు. ఈ విషయాన్ని ఎస్‌బి నిఘా వర్గాల ద్వారా తెలుసుకుని తమ సిబ్బందిచే ప్రత్యేక దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ దాడుల్లో మార్టూరు, పంగులూరు, మేదరమెట్ల, మద్దిపాడు, ఉలవపాడు మండలాల్లోని 15 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి రూ.9.85 లక్షల విలువైన 1097 లీటర్ల డీజిల్‌, 200 లీటర్ల పెట్రోలు, 100 లీటర్ల కిరోసిన్‌, 122 డ్రమ్ముల తారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ముందుగా రేణంగివరం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. 2010లో ఆయిల్‌ విషయమై జరిగిన ఒక హత్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా పోలీసులను కలిసి యోగక్షేమాలు అడిగి సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో చీరాల డిఎస్‌పి శ్రీకాంత్‌, ఇంకొల్లు సిఐ సుబ్బారావు, ఇంకొల్లు, యద్దనపూడి ఎస్‌ఐలు చెంచు ప్రసాద్‌, చౌదరి పాల్గొన్నారు.