
ఆయన చూడటానికి అంధుడు. కానీ, ఉద్యమాల్లో ముందు చూపు ఉన్నవాడు. ఒక జిల్లా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రథ సారథి. చాలా రాజకీయ పార్టీల్లో అది సాధ్యం కాకపోవొచ్చు. కానీ, సిపిఎంలో సాధ్యమైంది. సిద్ధాంత అవగాహన, ప్రజాపోరాటాల పట్ల విశ్వాసం, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయగలిగిన నాయకత్వ స్థాయి.. ఉన్నందున ఆయన్ని పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆయన పేరు భారతీ అన్న (51). తమిళనాడులోని చెంగలపట్టు జిల్లాకు సిపిఎం కార్యదర్శి.
భారతీ అన్న పుట్టుకతో అంధుడు కాదు. అయితే చిన్న వయసులోనే దృష్టిలోపం మొదలైంది. 2017 నాటికి పూర్తిగా రెండు కళ్లు చూపు కోల్పోయాయి. 'సిపిఎంలో సాధారణ కార్యకర్త పార్టీ నాయకత్వానికి ఎదగవచ్చు. సామాజికంగా అణచివేయబడిన వ్యక్తి కూడా ఉన్నత స్థానానికి చేరుకోగలడు. ఇప్పుడు దృష్టిలోపం ఉన్న వ్యక్తి కూడా మా పార్టీలో నాయకుడిగా ఎదగగలడని నన్ను ఎన్నుకుని నిరూపించారు' అంటారు భారతీ.
1971 పక్కమ్లో జన్మించిన భారతీకి చాలా చిన్న వయసులోనే హై మైఫియా సోకింది. 3వ తరగతి చదివే నాటికి మైనస్ 18 దృష్టి లోపంతో మందపాటి కళ్ల అద్దాలతో మొదటి బెంచీలో కూర్చునేవాడు. నల్లబోర్డు మీద అక్షరాలు అంతంతమాత్రమే కనిపించేవి. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా పట్టుదలగా చదివాడు ఆయన. గణితంలో డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఆ తరువాత న్యాయవాద విద్య పూర్తిచేసి లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు.
1999లో కళ్ళకు లెన్స్ ఆపరేషన్ చేయించుకున్నారు భారతి. 'ఆపరేషన్ తరువాత దూరంగా ఎగురుతున్న పక్షులను చూడగలిగాను. అప్పుడు నాకు ఎగిరి గంతేయాలనిపించింది. అందరిలాగే ద్విచక్ర వాహనం నడిపేవాణ్ణి. ప్రత్యక్షంగా ఎంతోమందిని కలిసే అవకాశం వచ్చింది. కాని ఆ చూపు 9 ఏళ్లపాటే ఉంది. క్రమేణా కంటి నరాలు దెబ్బతిని మళ్లీ దృష్టి లోపం ప్రారంభమైంది' అంటూ అప్పటి రోజులు గుర్తుచేసుకున్నారు భారతీ. ఆపరేషన్ తరువాతే న్యాయవాదిగా మద్రాసు హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఆ తరువాత ఉద్యమ అవసరాల కోసం చెంగలపట్టుకు చేరుకున్నారు.
పార్టీలో పూర్తికాలం కార్యకర్తలైన భారతీ మోహన్, కుంజిథమ్ దంపతుల కుమార్తె గుణావతితో 30 ఏళ్ల వయసులో ఆయనకు వివాహమైంది. అప్పటినుంచి ఆయనకు చేదోడువాదోడుగా గుణావతి ప్రయాణిస్తున్నారు. ఆపరేషన్ తరువాత 2014లో మొదలైన దృష్టిలోప సమస్య 2017 నాటికి పూర్తిగా చూపు కోల్పోయేలా చేసింది. దాంతో, చాలా ఒత్తిడికి గురయ్యారు. 3, 4 ఏళ్లు అలా బాధ పడుతూనే ఉండిపోయారు. 'ఈ కారణంగా నాకు మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. స్నేహితులు, బంధువులు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వారిని గుర్తించలేక పోయేవాడిని. న్యాయవాదిగా కోర్టులో ఏ పత్రాన్ని స్వయంగా అందించలేక పోయేవాణ్ణి. అది నన్ను తీవ్రంగా బాధించేది' అని చెప్పారు భారతి. అప్పుడే తనను తాను శక్తిమంతుడిగా తీర్చిదిద్దుకోవడానికి తనలాంటి వారిని కలుసుకోవడం ప్రారంభించారు. సాంకేతికతను ఉపయోగించుకుంటూ తన అధ్యయనాన్ని పెంపొందించుకున్నారు. విభిన్న ప్రతిభావంతుల కోసం పని చేసే సంఘంలో చేరి, వారి సమస్యలపై పనిచేశారు. తరువాత ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. నేషనల్ ఫ్లాట్‌ఫారమ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద డిసేబుల్డ్ (ఎన్పిఆర్డి)కి ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్నారు. తమిళనాడు 'అంటరానితన విమోచనా ఫ్రంట్'కు సహాయ కార్యదర్శిగా సేవలందించారు. ఆ తరువాత 'శారీరక వికలాంగ విభాగం'లో కూడా పనిచేశారు. 'నా లోపాన్ని పక్కనబెట్టి, నన్ను నేను నూతనంగా ఆవిష్కరించుకోవడంలో సాంకేతికత ఎంతో ఉపయోగపడిందం'టారు ఆయన. దృష్టిలోపం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఆయన మొదటినుంచి సిపిఎంలో ఉంటూ, వివిధ ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు.
నాయకుడిగా ...
2017 నాటికి భారతీ అన్న పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఉండేవారు. ఆ ఏడాది జిల్లా మహాసభ జరగటానికి ముందు జరిగిన కమిటీ సమావేశంలో ఆయన.. 'అంధత్వం కారణంగా పార్టీ కార్యకలాపాల్లో మునుపటిలా పాల్గనలేకపోతున్నాను. కాబట్టి కమిటీ బాధ్యతల నుంచి మినహాయించండి.' ఆయన కోరారు. కానీ, ఆయన శక్తిసామర్థ్యాలను ఎరిగిన నాయకత్వం, సహచరులు అందుకు అంగీకరించలేదు. దాంతో, జిల్లా కమిటీలో కొనసాగి, ఎన్నో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గన్నారు. 2021 మహాసభ నాటికి జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో ...
1989లో ఎస్ఎఫ్ఐ సభ్యుడిగా భారతీ అన్న ఉద్యమ ప్రస్థానం మొదలైంది. మేధోపరమైన అనేక చర్చలు, నిరంతరం ప్రజలతో మమేకమవ్వడం వంటి పార్టీ కార్యకలాపాలు ఆయనను ఆకర్షించాయి. ఆ ప్రేరణతోనే తన స్వగ్రామంలో యువజన సంఘం (డివైఎఫ్ఐ) స్థాపించారు. ప్రజలతో మమేకమై వారిని అనేక సమస్యలపై సంఘటితం చేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరినీ కలవడం, పార్టీపై ప్రజల్లో అవగాహన కల్పించడం చేసేవారు. ఆయన మిగతా సహచరులతో కలిసి అనతికాలంలోనే 40 గ్రామాలకు డివైఎఫ్ఐ కార్యకలాపాలు విస్తరించారు. అప్పుడే ఆయన పార్టీలో మరో మెట్టుకు ఎదిగారు. 32 ఏళ్ల తరువాత ఇప్పుడు చెంగలపట్టు జిల్లా కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
'భారతీ అన్నకు ఈ బాధ్యత ఆకస్మికంగా వచ్చింది కాదు. చాలాకాలంగా ఆయన పార్టీ కార్యకర్తల్లో ఒకరు. అనేక ఉద్యమాల్లో పాల్గన్నారు. చెంగల్పట్టు జిల్లా పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరు. సమర్థవంతమైన న్యాయవాది కూడా' అని చెప్పారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణన్.
యువజన సంఘంలో, ప్రజాసంఘాల్లో కీలకభూమిక పోషించిన భారతి ఒక పక్క దృష్టిలోప సమస్య వెంటాడుతున్నా ప్రజలను చైతన్యం చేయడంలో మాత్రం ఎప్పుడూ ముందుండేవారు. ఆయన పూర్తిగా చూపు కోల్పోయి ప్రజలతో మమేకమవ్వడం కష్టమని భావించినప్పుడు ా పార్టీ ఆయన అంకితభావానికి, సామార్థ్యానికి ప్రాధాన్యం ఇచ్చింది. దృష్టిలోపం ఉన్నా ప్రజల సాదకబాధలు తెలుసుకుంటూ వారిని చైతన్యవంతులను చేస్తున్న భారతీ .. ప్రజలను చైతన్యపరిచే సూర్యుడు. ప్రజాపక్ష పోరాటాలకు నాయకుడు. పోరాటాల పార్టీలో అంకితభావం ఉన్న కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పటానికి భారతీ అన్న ప్రస్థానం ఒక మంచి ఉదాహరణ.