Aug 19,2022 10:47

డెహ్రడూన్‌ : ఇటీవల కాలంలో ఎక్కడపడితే అక్కడ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించి వార్తల్లో నిలిచిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ బాబీ కటారియాను ఉత్తరాఖండ్‌ పోలీసులు అరెస్టు చేయనున్నారు. బాబీ కటారియా ఇటీవల స్పైస్‌జెట్‌ విమానంలో ప్రయాణిస్తూ ధూమపానం చేయడంతో పాటు.. నడిరోడ్డుపై కూర్చొని మద్యం సేవించి.. వాహనదారులను ఇబ్బందులకు గురి చేశారు. బాబీ కటారియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6.30 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఐటి చట్టం, ఐపిసిలోని పలు సెక్షన్ల కింద పోలీసులు అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. జిల్లా కోర్టు నుండి బాబీ కటారియాపై పోలీసులు అతడిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ తీసుకున్నారని ఎస్‌హెచ్‌ఒ రాజేంద్ర సింగ్‌ రావత్‌ తెలిపారు. అతని అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలను హర్యానా, ఇతర ప్రాంతాలకు పంపినట్లు తెలిపారు. విమానంలో ధూమపానం చేసిన వీడియో ఇప్పటిది కాదని, గతంలో జరగ్గా.. అతడి పేరును 15 రోజుల పాటు నో-ఫ్లైయింగ్‌ లిస్ట్‌లో ఉంచామని స్పైస్‌జెట్‌ తెలిపింది. అయితే దుబారులో షూటింగ్‌లో భాగంగా ఓ డమ్మీ విమానంలో తీసిన వీడియో అంటూ బాబీ కటారియా వాదిస్తున్నారు.