Feb 21,2021 20:45

''మహిళలకు కలిగిన మనోవేదనను తమ ఇష్టమైన ఏదేని వేదికపై దశాబ్దకాలం గడిచిన తరువాతైనా నిస్సందేహంగా పంచుకోవచ్చు. ఆమెకు ఆ స్వేచ్ఛ ఉంది. దీన్ని తప్పుపట్టలేం. ఈ సందర్భంగా ఆమె గౌరవాన్ని తక్కువ చేసి చూడలేం. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కు గురించి రాజ్యాంగం ఆర్టికల్‌ 21 చెబుతోంది..'' ఇవి ఇటీవల ఢిల్లీ కోర్టు వ్యాఖ్యలు. లైంగిక వేధింపుల కేసులో జర్నలిస్టు ప్రియా రమణిపై పరువునష్టం దావా వేసిన కేంద్ర మాజీ మంత్రి ఎం.జె అక్బర్‌ వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ కోర్టు పైవిధంగా అభిప్రాయపడింది. అయితే ఆమెను నిర్దోషిగా తేల్చేందుకు రెండేళ్ల సమయం, 50 విచారణలు చేసింది ధర్మాసనం.
2018లో జర్నలిస్టు ప్రియారమణి గతంలో సదరు మంత్రి ఓ పత్రికా ఎడిటర్‌గా ఉన్న సందర్భంలో తనను ఒంటరిగా హోటల్‌కు రమ్మని చెప్పి అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ట్విట్టర్‌ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. దానిని సమర్ధిస్తూ ఓ 20 మంది మహిళలు .. అక్బర్‌ తమపై కూడా తీవ్ర వేధింపులు చేశాడని గళం విప్పారు. దీంతో 90 మంది న్యాయవాదుల బృందంతో రమణిపై క్రిమినల్‌ పరువునష్టం కేసు నమోదుచేశాడు అక్బర్‌. ఈ కేసు విచారణ సాగుతున్నప్పుడే పలువురు బాలీవుడ్‌ హీరోలు, దర్శకులపై నమోదైన లైంగిక వేధింపుల కేసులు మూతబడ్డాయి. గతవారమే సుప్రీం మాజీ న్యాయమూర్తి రంజన్‌గొగోరుపై నమోదైన లైంగిక వేధింపుల కేసును సుప్రీం ధర్మాసనం కొట్టేసింది. ఈ తీర్పుల నడుమ ఢిల్లీ కోర్టులో రమణి కేసు విజయం సాధించింది. ఈ సందర్భంగా ''మహిళల గౌరవాన్ని తక్కువ చేసి చూడలేం'' అంటూ ధర్మాసనం పలికిన వ్యాఖ్యలు వారికి కాసింత ఊరటనిచ్చాయి.
ఈ తీర్పుతోనైనా మహిళలు భయపడకుండా, సిగ్గుపడకుండా తమపై జరిగిన దాడులను, హింసను బహిర్గతం చేసేందుకు వీలౌతుంది. కుటుంబ గౌరవం, భవిష్యత్తు దృష్ట్యా వేధింపులను బయటకు చెప్పలేని ఎంతోమంది మహిళలకు ఈ తీర్పు బలం చేకూర్చిందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.
విఫల న్యాయం
2018లో సోషల్‌ మీడియా వేదికగా 'మీటూ' ఉద్యమం పెద్ద ఎత్తున సాగింది. 'లైంగిక వేధింపులకు గురైన ఒక మహిళ తను ఎదుర్కొన్న గాయాన్ని బయటకు చెప్పకుండా ఉందంటే కారణం నేరానికి సంబంధించి ఏవిధమైన ఫిర్యాదు చేసేందుకు ఆమె ముందుకు రాకపోవడమే. ఈ ధోరణి రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ విఫలమవ్వడాన్ని నిర్ధారిస్తోంది' అని ఉద్యమం సాగుతున్న సమయంలోనే న్యాయవాది ఇందిరా జైసింగ్‌ అభిప్రాయపడ్డారు.
పరువునష్టం కేసు ఒక్క రమణిపైనే నమోదవ్వలేదు. ఆ సమయంలో ఎంతోమంది తమ అనుభవాలను పంచుకున్నారు. వారిలో అనేకమందిపై ఈ కేసు నమోదైంది. కోర్టులో ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు వారందరికీ ఈ తీర్పు ఎంతో శక్తినిచ్చిందని పలువురు న్యాయనిపుణులు భావిస్తున్నారు. 'ఇది ఇద్దరు పలుకుబడి గల వ్యక్తులకు సంబంధించింది. కాబట్టి మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. కాని మన మధ్యే ఇటువంటి నిందలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళలు నిరంతరాయంగా పోరాడుతూనే ఉన్నారు' అంటున్నారు ముంబయి మహిళా హక్కుల న్యాయవాది వీణా గౌడ్‌.
'ఢిల్లీ కోర్టు తీర్పును దేశంలోని అన్ని భాషల్లో అనువదించి, విస్తృత ప్రచారం చేయాలి. దీనివల్ల అట్టడుగు స్థాయి మహిళలకు సమాచారం చేరుతుంది. తమపై జరిగిన అన్యాయాన్ని బయటపెట్టేందుకు.... ఫిర్యాదులు చేసేందుకు ముందుకువచ్చేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది' అంటున్నారు పలువురు మహిళా హక్కుల నేతలు.
కేసు .. పూర్వోత్తరాలు
1993లో ఉద్యోగ ఇంటర్వ్యూ నిమిత్తం తన మాజీ బాస్‌ లైంగిక వేధింపులకు గురి చేశాడని ఒక ఆర్టికల్‌ ద్వారా 2017లో ప్రియా చెప్పారు. ఆ తరువాత, 2018లో, తనను వేధించిన వ్యక్తి కేంద్రమంత్రి ఎంజె అక్బర్‌ అని వెల్లడించింది. ఇది వెలుగులోకి వచ్చిన కొన్నిరోజుల వ్యవధిలోనే చాలా మంది మహిళలు అతనిపై ఇలాంటి ఆరోపణలు చేశారు. దీంతో అతను అక్టోబర్‌ 2018లో విదేశాంగ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. పైగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రమణి తన పరువు తీసిందని ఆమెపై అదే నెలలో ఫిర్యాదు చేశాడు.
కేసు విచారణ సందర్భంగా అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ న్యాయమూర్తి రవిందర్‌ కుమార్‌ పాండే వ్యాఖ్యలివి...
లైంగిక వేధింపులనేవి మూసి ఉన్న తలుపుల వెనుకే జరుగుతాయన్నది విస్మరించకూడదు. ఈ కారణంగానే చాలా మంది మహిళలు తమకు కళంకం అంటుకుంటుందని అన్యాయాన్ని బయటకు చెప్పరు. సమాజంలో గొప్ప హోదా గల వ్యక్తి కూడా లైంగికవేధింపుదారుడై ఉండవచ్చు. అలాగే బాధితులు కూడా ఉన్నత హోదా గలవారు ఉంటారు. ఈ వేధింపులు వారి గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అందుకే దశాబ్దాల తరువాత కూడా ఫిర్యాదులు ఇచ్చే స్వేచ్ఛ స్త్రీలకు ఉంది.
ఈ విజయం ప్రియా రమణి ఒక్కరిదే కాదు.... దేశంలో ఇంటా, బయటా, పని ప్రదేశాల్లో నిత్యం వేధింపులకు గురవుతున్న ఎంతోమంది మహిళలది. ఈ తీర్పు తమపై జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా చెప్పే శక్తినిస్తుందని ఆశిద్దాం.

సముచిత తీర్పు-  ప్రియారమణి
ఈ పోరాటం నా ఒక్కదానిదే కాదు... ఎందరో బాధిత మహిళలది. ఈ సమస్యపై నాతోపాటు మాట్లాడిన మహిళలందరికీ, నా ముందు మాట్లాడిన వారికీ, నా తర్వాత మాట్లాడిన వారందరికీ నేను ప్రాతినిధ్యం వహిస్తాను. ఈ తీర్పు చాలా సముచితమైంది. నా విజయం కచ్చితంగా ఎక్కువ మంది మహిళలు మాట్లాడడాన్ని ప్రోత్సహిస్తుంది. బాధితులను కోర్టుకు తీసుకెళ్లేముందు శక్తివంతమైన పురుషులు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేస్తుంది'.