Oct 03,2020 06:58

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ముగింపులో ఆమోదించబడిన మూడు కార్మిక చట్టాలు దేశ కార్మిక వర్గంపై తీవ్రమైన దాడిగా చెప్పవచ్చు. పారిశ్రామిక సంబంధాల నిబంధనావళి... వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య, పని పరిస్థితుల నిబంధనలు...గతేడాది ఆమోదించిన వేతనాలపై నిబంధనావళి... ఈ మూడు బిల్లులు కార్మికులకు సంబంధించిన పలు చట్టాలను సరళీకరించ డానికి, ఆధునీకరించడానికి ఉద్దేశించినవని స్పష్టమవు తోంది. అయితే, ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా నయా ఉదారవాద సంస్కరణల్లోని కీలకమైన భాగమే. అవసరమైనపుడు కార్మికులను తీసుకుని, అక్కర్లేనపుడు తొలగించే పద్ధతి (హైర్‌ అండ్‌ ఫైర్‌) అమలు చేయడానికి, కార్మిక వర్గాన్ని తమకు అవసరమైనట్లుగా మార్చుకు నేందుకు, పెట్టుబడిదారులు గరిష్ట స్థాయిలో లాభాలను ఆర్జించడానికి అవరోధంగా వున్న అన్ని రక్షణలను తొలగించడానికి ఈ చర్య ఉద్దేశించినది.
ప్రస్తుతమున్న కార్మిక చట్టాల్లో కార్మికులకు కల్పించిన రక్షణకు, పరిమిత హక్కులకు విఘాతం కలిగించేలా ఈ కొత్త కార్మిక చట్టాలు వున్నాయి. పెద్ద సంఖ్యలో పారిశ్రామిక సంస్థలు కార్మిక చట్టాల పరిధికి వెలుపల వుండేలా ఈ కార్మిక చట్టాలను వర్తింపచేసే ఫ్యాక్టరీల పరిమాణాన్ని (సైజ్‌) సవరించారు. అంతకుముందు, విద్యుత్‌ను ఉపయోగిస్తూ, 10 మందికి పైన కార్మికులు పనిచేసినా లేదా విద్యుత్‌ను ఉపయోగించకుండా 20 మంది కార్మికులు పనిచేసినా ఆ సంస్థకు కార్మిక చట్టాలను వర్తింపచేయాల్సి వుంది. ఇప్పుడు ఈ పరిమితులను వరుసగా 20, 40కి పెంచారు.
ఒక్క మాటలో చెప్పాలంటే, కొత్తగా తీసుకు వచ్చిన పారిశ్రామిక సంబంధాల నిబంధనావళితో 70 శాతం పారిశ్రామిక సంస్థలను, 74 శాతం పారిశ్రామిక రంగ కార్మికులను హైర్‌ అండ్‌ ఫైర్‌ వ్యవస్థలోకి తీసుకు వచ్చారు. అంతకు ముందు, వంద లేదా అంతకు పైగా కార్మికులు పని చేసే ఫ్యాక్టరీలను మూసివేయాలన్నా, కార్మికులను తొలగించాలన్నా రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సి వుండేది. ఇప్పుడు ఆ పరిమితిని 300 మంది కార్మికులు గల ఫ్యాక్టరీలకు పెంచారు. పైగా, నోటిఫికేషన్‌ ద్వారా ఈ పరిమితిని మరింత పెంచడానికి ప్రభుత్వానికి అధికారం వుంది. 300 మంది కన్నా తక్కువ మంది కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలు నిబంధనలకు కట్టుబడి వుండాల్సిన అవసరం లేదు.
ఒరిజినల్‌ నిబంధనలను నీరుగార్చేలా కొత్త నిబంధనలను రూపొందించడానికి, లేదా కార్మికులపై స్వారీ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం కల్పించేలా ఈ బిల్లులు తీవ్రమైన లోపభూయిష్టంగా వున్నాయి. ఉదాహరణకు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్తగా స్థాపించే ఏ పారిశ్రామిక సంస్థనైనా ఈ నిబంధనావళి నుండి మినహాయించవచ్చని పారిశ్రామిక సంబంధాల కోడ్‌ పేర్కొంటోంది. కరోనా సమయంలో రాష్ట్రంలో కొత్తగా స్థాపించే పరిశ్రమలకు కార్మిక చట్టాల నిబంధనల అమలును నిలిపి వేస్తూ మధ్యప్రదేశ్‌ లోని బిజెపి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ తీసుకు రావడం ఈ నిరంకుశ నిబంధన గురించిన ఒక ఉదాహరణగా చూడవచ్చు. రాష్ట్రాలకు అప్పగించిన శాసనాధికారాలు కార్మిక రక్షణ చట్టాలను నీరుగార్చడానికి సంబంధించిన పోటీకి ఇది దారి తీస్తుంది.
కార్మికులను అనధికారికంగా తీసుకోవడం, కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం, క్యాజువల్‌ కేటగిరీలో తీసుకోవడం వంటి పద్ధతులను కొత్త కార్మిక చట్టాలు ప్రోత్సహిస్తాయి. నిర్దిష్ట కాలానికి ఉపాధి కల్పించడం ద్వారా కొత్త పద్ధతిలో షార్ట్‌టర్మ్‌ వర్క్‌ను ప్రవేశ పెట్టారు. ఈ పద్ధతి సీజనల్‌ వర్క్‌ అవసరాలను నెరవేర్చవచ్చు కానీ అటువంటి నిర్దిష్ట కాల ఉపాధి పునరుద్ధరణకు పరిమితి అంటూ లేకుండా పోయింది. దీనివల్ల కార్మికునికి ఎలాంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించకుండానే రెగ్యులర్‌ వర్క్‌ కేటగిరీ లోకి మారిపోతుంది. కనీసం 20 మంది కాంట్రాక్టు కార్మికులకు పని కల్పించే సంస్థలకు కాంట్రాక్టు నిబంధనలు వర్తించేలా బిల్లు నిబంధనావళి వుండేది. ఇప్పుడు ఆ పరిమితిని 50 మంది కార్మికులకు పెంచారు. దీంతో, మూడింట రెండు వంతుల పారిశ్రామిక సంస్థలు కాంట్రాక్టు చట్ట పరిధికి వెలుపలే వుండిపోతున్నాయి. ఇకపోతే కార్మికుల భద్రత, పని పరిస్థితులను పరిష్కరించేందుకు ఎక్కడా తీవ్రమైన ప్రయత్నాలు చేసినట్లే లేదు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కరోనా కష్ట కాలంలో కూడా 30 వరకు పారిశ్రామిక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 75 మంది కార్మికులు మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. కార్మికుల భద్రతా ప్రమాణాలను, గరిష్ట పనిగంటలను నిర్వచించే వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల బిల్లు...చిన్న చిన్న సంస్థలను తన పరిధి నుండి మినహాయించింది. పైగా, భద్రతా ప్రమాణాల వర్గీకరణ, వివిధ సామాజిక భద్రతా పథకాల వర్తింపు పరిమితులు వంటి అంశాలను నిబంధనల ద్వారా పేర్కొనడమో లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడమో చేసింది. కార్మికులు సంఘటితం కావడానికి, యూనియన్‌ పెట్టుకోవడానికి గల హక్కును కూడా కొన్ని ఆంక్షలు, పరిమితులకు లోబడి వుండేలా చేసింది.
యూనియన్ల గుర్తింపునకు ఎలాంటి ప్రామాణికాలు లేవు. యూనియన్ల గుర్తింపునకు రహస్య బ్యాలెట్‌ పెట్టాలన్న దీర్ఘకాల డిమాండ్‌ను పట్టించుకోలేదు. సమిష్టి బేరసారాల క్రమాన్ని స్పష్టంగా, నిర్దిష్టంగా పేర్కొనలేదు. నిర్దిష్టమైన ఆదేశాలు లేకపోవడం వల్ల ఒక సంస్థలో పని పరిస్థితులు ఒకే తీరున వుండవు. పెద్ద సంఖ్యలో కార్మికులు కాంట్రాక్టు పద్ధతిలోనో లేదా ఫిక్స్‌డ్‌ టర్మ్‌ వర్కర్లుగానో వుంటారు. దీనివల్ల కార్మిక సంఘాలకు పని చేయడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అన్నింటికంటే అత్యంత తీవ్రమైన దాడి ఏమిటంటే సమ్మె చేసే హక్కును నిషేధించడం. 14 రోజులు ముందుగా సమ్మె నోటీసును ఇవ్వాలని పారిశ్రామిక సంబంధాల కోడ్‌ పేర్కొంటోంది (అదే సమయంలో, సమ్మె నోటీసును 60 రోజులు ముందుగా ఇవ్వాలని కూడా పేర్కొంటున్నారు). దీనివల్ల సహజంగానే ఈలోగా రాజీ బేరాలు మొదలవుతాయి. ఈ సమయంలో సమ్మె చేయడానికి అనుమతించరు. రాజీ లేదా సయోధ్య కుదర్చడానికి జరుగుతున్న యత్నాలు ముగిసిన వారం రోజుల తర్వాతనే సమ్మె చేపట్టాల్సి వుంటుంది. మధ్యవర్తిత్వ కార్యకలాపాలు చేపట్టే మూడు మాసాల కాల పరిమితిలో కూడా సమ్మె చేయడానికి లేదు. ఇకపోతే, నిత్యావసర సర్వీసుల్లో పనిచేసే కార్మికులైతే ఆరు వారాలకు ముందుగా సమ్మెకు నోటీసు ఇవ్వాల్సి వుంటుంది. ఇటువంటి కోకొల్లలుగా వున్న, గందరగోళమయమైన నిబంధనల నుండి మనకు అర్ధమయ్యేదేమిటంటే నోటీసులిచ్చినా కార్మికులు సమ్మె చేయడానికి వుండదు. సుదీర్ఘమైన రాజీ లేదా సయోధ్య లేదా మధ్యవర్తిత్వ దశలన్నీ పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.
కరోనా సమయంలో పార్లమెంట్‌పై ఒత్తిడి తేవడం ద్వారా ఈ మూడు కార్మిక వ్యతిరేక బిల్లులను మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టిన ఈ మూడు బిల్లులు 2019లో ప్రవేశ పెట్టిన వాటికన్నా భిన్నంగా వున్నాయి. లేఆఫ్‌లు ప్రకటించడానికి, కార్మికులను తొలగించడానికి ముందస్తు అనుమతులు తీసుకోవడానికి ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల సంఖ్య పరిమితిని 300కి పెంచడం వంటి కొత్త నిబంధనలు ఈ కొత్త బిల్లులో పొందుపరిచారు. స్థాయీ సంఘాల పరిశీలన లేకుండానే, ప్రతిపక్షాలు లేకుండా పేరుకు మాత్రమే జరిగిన చర్చ అనంతరం ఈ బిల్లులను ఆమోదించారు. ఈ బిల్లులు వర్గ దాడి కిందకు వస్తాయి. బడా పెట్టుబడిదారులు, అంతర్జాతీయ ఆర్థిక పెట్టుబడుల సేవలో మునిగిన నూతన భారతావనిలో వాస్తవికత ఎలా వుందో తెలియచేస్తాయి. నయా ఉదారవాదానికి అనుకూలంగా తీసుకున్న ఈ చర్యలు దశాబ్దాల తరబడి కార్మికులు పోరాటాల ద్వారా సాధించిన హక్కులను, రక్షణలను నీరుగార్చాయి. ఈ కార్మిక చట్టాలు, మూడు వ్యవసాయ బిల్లుల ఆమోదం చూస్తే ఇది కార్మిక, కర్షకులపై సాగించిన దుర్మార్గపు దాడిగా వుంది.
ఐక్య పోరాటం, నిరంతర ప్రతిఘటనల ద్వారా ఈ దాడిని తిప్పికొట్టడానికి కార్మికవర్గం సమాయత్త మవుతోంది. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళనలు, నిరసనలకు మంచి ప్రతిస్పందన వచ్చింది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ జంట దాడులకు వ్యతిరే కంగా శక్తివంతమైన కార్మిక-రైతు ఐక్యతను నిర్మించాల్సిన ఆవశ్యకత వుంది. పేర్కొంది. కార్మికుల, రైతుల పోరాటాలను ఉధృతం చేయడం, విస్తరించడం ద్వారా వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల విస్తృత ఐక్యతను ముందుకు తీసుకెళ్ళాలి.
('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)