Jan 14,2022 08:03
  • ఈక్యూ-1 బెర్తు వ్యవహారంలో రూ.385 కోట్లు చెల్లించాలన్నఒత్తిడికి బ్రేక్‌
  • రూ.150 కోట్ల చెల్లించి బెర్తు స్వాధీనానికి విపిటి చర్యలు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ పోర్టు ట్రస్ట్‌ (విపిటి) విషయంలో అదానీ వ్యూహం బెడిసికొట్టింది. విశాఖ పోర్టులో ఈక్యూ-1 బెర్తు వ్యవహారంలో అదానీ ఎంచుకున్న మధ్యవర్తిత్వ మార్గం ఆయన మెడకే చుట్టుకుంది. విశాఖ పోర్టుకు బెర్తును అప్పగించాలంటూ తాను ఆశ్రయించిన ఆర్బిట్రేషన్‌ కోర్టు ఆదేశాలివ్వడంతో అదానీ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. విశాఖ పోర్టు ద్వారా తాను రోడ్డు మార్గంలో వ్యాపారం చేసేందుకు 2011లో అదానీ ఈక్యూ-1 బెర్తును తీసుకున్నాడు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రెండేళ్లు మాత్రమే కార్గో హేండ్లింగ్‌ చేసి తర్వాత వ్యాపారం చేయకుండా వదిలేశాడు. దీనిపై విశాఖ పోర్టు యాజమాన్యం 2017 సంవత్సరం నుంచి అదానీకి రిమైండర్స్‌ ఇస్తున్నా పట్టించుకోకుండా పోర్టు ఆదాయానికి గండికొడుతూ వచ్చారు. ఈక్యూ-1 బెర్తును తానే అభివృద్ధి చేసినందున తనకు విపిటి సుమారు రూ.385 కోట్లు చెల్లించాలంటూ 2021లో ఆర్బిట్రేషన్‌కు వెళ్లాడు. బెర్తును తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. తనకున్న పలుకుబడి ఉపయోగించుకొని పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బెర్తును అదానీ వదిలేయాలని, ఈక్యూ-1 బెర్తు నిర్మించినందుకు పోర్టు చెల్లించాలని చూస్తోన్న రూ.150 కోట్లు స్వీకరించాలని ఆర్బిట్రేషన్‌ తన వాదనను తాజాగా వినిపించినట్లు సమాచారం. దీంతో, పోర్టు అధికార వర్గాలు ఇందుకు సంబంధించిన ప్రక్రియకు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.

                                               బిఒటి పద్ధతిలో అదానీకి ఈక్యూ-1 బెర్తు

2011-12 సంవత్సరాల మధ్య అదానీ గ్రూప్‌ పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌ షిప్‌ (పిపిపి) విధానంలో అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చి బెర్తు నిర్మాణం కోసం సుమారు రూ.400 కోట్ల వరకూ ఖర్చు చేసింది. 2015 వరకూ బెర్తు నిర్మాణంలో పోర్టు భాగస్వామ్యం అయింది. 2015 నుంచి రెండేళ్లపాటు వ్యాపారం చేశారు. వ్యాపార ఒప్పందంలో భాగంగా వచ్చే ఆదాయంలో 40 శాతం పోర్టుకు, 60 శాతం అదానీ తీసుకోవాలి. ఇది రెండేళ్లపాటు నడిచింది. గంటకు 20 వేల టన్నుల కోల్‌ను నిర్వహించగల సామర్థ్యంతో ఈ బెర్తు నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో బొగ్గు విధానం మారింది. దీనిలో భాగంగా స్టీమ్‌ కోల్‌ విదేశాల నుంచి దిగుమతి చేయకూడదని, దేశీయంగానే తవ్వకాలు చేసి వినియోగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, 2015 తర్వాత ఆదానీ ఈ బెర్తులో కార్గో చేయకపోవడంతో పోర్టు ఆదాయానికి గండిపడింది. పోర్టు యాజమాన్యం ఒత్తిడి పెంచడంతో బెర్తు నిర్మాణానికైన ఖర్చులో 90 శాతం అంటే రూ.385 కోట్లు ఇవ్వాలంటూ అదానీ పట్టుపట్టాడు. దీనిని పోర్టు యాజమాన్యం గట్టిగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వ మార్గాన్ని అదానీ ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో అదానీ సంస్థకు రూ.150 కోట్లు చెల్లించి బెర్తును ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సహా స్వాధీనం చేసుకోవాలంటూ మూడు రోజుల క్రితం విశాఖ పోర్టుకు అందిన సమాచారంతో పోర్టువర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.