Jan 14,2022 08:35

జల్‌పాయిగురి : పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిగురి జిల్లాలో పట్టాలు తప్సిన బికనీర్‌-గౌహతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మోన్యాగురి నగరానికి సమీపంలో ఈ ప్రమాదం గురువారం సాయంత్రం జరిగింది. 12 బోగీలు పట్టాలు తప్పాయి. 9 మంది చనిపోగా. 45 మందికి పైగా గాయపడ్డారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ శుక్రవారం ఘటనాస్థలికి రానున్నారు. పట్టాలు తప్పిన బోగీల్లో మరికొంత మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. వారిని బయటకు తీసేందుకు గ్యాస్‌ కట్టర్లు వినియోగించి.. బోగీలను తెరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఘటన పట్ల ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితిపై మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల పట్ల చింతిస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు.