Apr 18,2021 12:31

కోల్‌కతా : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల ప్రచారం, పోలింగ్‌ నిర్వహిస్తుండగా.. మరోవైపు చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికి ఐదు విడతల పోలింగ్‌ ముగిసింది. మరో మూడు విడతల పోలింగ్‌ జరగాల్సి వుంది. శనివారం ఒక్కరోజులోనే అత్యధిక కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, మురై నియోజకవర్గానికి చెందిన అధికార టిఎంసి ఎమ్మెల్యే అబ్దుర్‌ రెహ్మన్‌ కరోనాతో మరణించారు. కరోనా చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మరణించినట్లు వైద్యులు తెలిపారు. రెహ్మాన్‌కు పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆయన స్థానంలో డా.మోసారఫ్‌ను టిఎంసి బరిలోకి దింపింది. కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థి రెజాల్‌ హక్‌, రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీకి చెందిన ప్రదీప్‌కుమార్‌లు  కరోనాతో మరణించారు.

ఎన్నికల ప్రచారాల్లో కరోనా నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించడం లేదు. తాజాగా శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో అత్యధికంగా 7,713 కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 6,51,508కి పెరిగినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు 34 మంది కరోనాతో మరణించగా, మృతుల సంఖ్య 10,540కి చేరింది. కోల్‌కతాలో 1,998 కేసులు నమోదుకాగా, 10 మంది మరణించారు. పొరుగునే ఉన్న నార్త్‌ 24 పరగణాల జిల్లాలో 8 మంది మరణించగా, ముర్షిదాబాద్‌లో ఐదుగురు, బిర్భూమ్‌లో ముగ్గురు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఇద్దరు, పురూలియాలో ఇద్దరు మరణించినట్లు వైద్య శాఖ ప్రకటించింది. హుగ్లీ, హౌరా, బర్ధామన్‌, జల్పాయిగురి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు.

బెంగాల్‌లో ఎన్నికలతో.. చాపకింద నీరులా విజృంభిస్తున్న కరోనా