Nov 19,2020 12:15

న్యూఢిల్లీ : బెంగళూరు టెక్‌ సమ్మిట్‌ -2020ని గురువారం ప్రధాని మోడీ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సమ్మిట్‌ను కర్ణాటక ప్రభుత్వంతో పాటు కర్ణాటక ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ సొసైటీ (కెఐటిఎస్‌), కర్ణాటక ప్రభుత్వ విజన్‌ గ్రూప్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్‌ స్టార్టప్‌, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టిపిఐ), ఎంఎం యాక్టివ్‌ సైన్స్‌ టెక్‌ కమ్యూనికేషన్స్‌లు నిర్వహించనున్నాయి. ఈ ఏడాది 'నెక్ట్‌ ఈజ్‌ నౌ' అనే థీమ్‌తో నవంబర్‌ 19 నుండి 21 వరకు మూడురోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మరియు బయోటెక్నాలజీ రంగంలో ప్రముఖ సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల ప్రభావంపై దృష్టి సారించడంతో పాటు కరోనా అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లపై చర్చ జరగనుంది. ఈ సమ్మిట్‌లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌, స్విస్‌ కాన్ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు గై పార్మెలిన్‌లు హాజరవనున్నారు. 22 ఏళ్ల క్రితం ఎబి.వాజ్‌పేయి ఈ సమ్మిట్‌ను ప్రారంభించారని, మళ్లీ మరోసారి ప్రధాని మోడీ ఈ సమ్మిట్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సిఎన్‌ అశ్వత్‌ పేర్కొన్నారు.