
ప్రజాశక్తి - నరసరావుపేట : కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరేసి ఆపై తానూ ఉరేసుకున్న సంఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రొంపిచర్ల మండలం నల్లగార్లపాడుకు చెందిన మల్లెల వెంకటేశ్వరరెడ్డి, ద్రాక్షాయని దంపతుల కుమార్తె శివలింగేశ్వరి (27)కి వినుకొండ మండలం విఠంరాజుపల్లికి చెందిన దొండేటి ఇంద్రారెడ్డికి 2015లో వివాహమైంది. వీరికి చరణసాయిరెడ్డి(8), జతిన్‌రెడ్డి(4) అనే ఇద్దరు కుమారులున్నారు. ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్న ఇంద్రారెడ్డి నరసరావుపేట పట్టణంలో పెద్ద చెరువు మహాలక్ష్మి నగర్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మృతురాలు శివలింగేశ్వరి భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని శివలింగేశ్వరిని హింసించినట్లు, కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తమ వద్ద వాపోయినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఇంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యులు తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇంద్రారెడ్డి, అతని కుటుంబీకులను కఠినంగా శిక్షించాలన్నారు. నరసరావుపేట డీఎస్పీ చినవిజయ భాస్కర్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానియ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శివలింగేశ్వరి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.