Jun 10,2021 19:26

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లోని భారత్‌-బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఒక చైనా పౌరుడిని భారత సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్‌) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. మాల్దా జిల్లా పరిధిలోని సరిహద్దు సమీపంలో బిఎస్‌ఎఫ్‌ బలగాలు అతన్ని అడ్డుకున్నాయని పేర్కొన్నారు. సరిహద్దు దాటి భారత్‌లోకి ఎందుకు ప్రవేశించాడన్న దానిపై బిఎస్‌ఎఫ్‌ అధికారులు, స్థానిక పోలీసులతోపాటు నిఘా సంస్థలు అతన్ని ప్రశ్నిస్తున్నాయి. విచారణ ముగిసిన తరువాత తదుపరి వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. చైనా పౌరుడి వద్ద నుంచి ఒక ల్యాప్‌టాప్‌, చైనా పాస్‌పోర్టును, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.