Jun 11,2021 21:34

* విద్యావేత్తలు, నోబెల్‌ అవార్డు గ్రహీతలు, ఈయు ఎంపీల డిమాండ్‌
* ప్రధాని మోడీ, సిజెఐ రమణ, మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్‌లకు లేఖ
న్యూఢిల్లీ :
బీమా కోరేగావ్‌ కేసులో అరెస్టు చేసిన 16 మంది రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పలువురు విద్యావేత్తలు, యూరోపియన్‌ యూనియన్‌(ఈయు) పార్లమెంటు సభ్యులు, నోబెల్‌ అవార్డు గ్రహీతలు, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఇతర వ్యక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి.రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే, ఇతర భారత అధికారులకు తాజాగా ఒక లేఖ రాశారు. హక్కుల కార్యకర్తలను జైల్లో దుర్భరమైన పరిస్థితుల్లో నిర్బంధించడంతోపాటు వారికి తగిన వైద్య సంరక్షణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ఖైదీలుగా ఉన్న వీరు కరోనా వైరస్‌కు సంబంధించి మరిన్ని స్ట్రెయిన్‌లకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్న వారికి తగిన వైద్యం కూడా అందడం లేదని తెలిపారు. ఈ లేఖ కాపీని ఈయు మానవ హక్కుల కమిషనర్‌, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌ కార్యాలయానికి కూడా పంపించారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో రాజకీయ ఖైదీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేస్తూ తాత్కాలిక పరిపాలన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో ప్రముఖ విద్యా, బాషావేత్త నోమ్‌ చోస్కీ, యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యులు మార్గరేట్‌ ఔకేన్‌, ఇడోయా విల్లానుయేవా, పలువురు బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యులు, ఏకపక్ష నిర్బంధాలపై ఐరాస వర్కింగ్‌ గ్రూపు మాజీ అధ్యక్షుడు జోస్‌ ఆంటోనియో, నోబెల్‌ గ్రహీతలు ఓల్గా టకర్కుక్‌, వోల్‌ సోయింకా, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పార్థ ఛటర్జీ, బ్రౌన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అసుతోష్‌ వార్ష్నీ, మానవ హక్కుల కార్యకర్త షహీదుల్‌ అలాం, ది గార్డియన్‌ మాజీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ యుకె అలాన్‌ రుస్‌బ్రిడ్జన్‌, జర్నలిస్టు నావోమి క్లెయిన్‌లు ఉన్నారు. ఖైదీలతో కిక్కిరిసిపోయిన జైలు గదులతో పాటు నీటి కొరత, వైద్య పరికరాలు అందుబాటులో లేని కారణంగా రాజకీయ ఖైదీలకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదం పొంచివుందని హెచ్చరించారు. ఇప్పటికే వీరిలో అనేక మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారని, వారి ఆరోగ్యం గణనీయంగా క్షీణించిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. మరింత విషాదం చోటుచేసుకోకుండా ప్రభుత్వంతో పాటు కోర్టులు తగిన నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ ఖైదీలు మానవతా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని నొక్కిచెప్పారు. బీమా కోరేగావ్‌ కేసులో అరెస్టయిన 16 మంది రాజకీయ ఖైదీల్లో ఇద్దరు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరారని పేర్కొన్నారు. అనారోగ్యంతో పలువారాల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత సామాజిక కార్యకర్త వరవరరావు తాత్కాలిక బెయిల్‌ పొందిన విషయాన్ని వారు గుర్తుచేశారు.

ఈ కేసులో అరెస్టయిన వారిలో రచయిత, ముంబైకి చెందిన దళిత హక్కుల కార్యకర్త సుధీర్‌ ధావలే, గడ్చిరోలికి చెందిన యువ కార్యకర్త మహేష్‌ రౌత్‌, నాగపూర్‌ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్య విభాగాధిపతిగా ఉన్న సోమా సేన్‌, న్యాయవాదులు అరుణ్‌ ఫెర్రీరా, సుధా భరద్వాజ్‌, రచయిత వరవరరావు, సామాజిక కార్యకర్త వెర్నోన్‌ గాన్‌స్లేవ్స్‌, ఖైదీల హక్కుల కార్యకర్త రోనా విల్సన్‌, ప్రముఖ సామాజిక కార్యకర్త స్టాన్‌స్వామి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ హనీ బాబు, స్కాలర్‌ ఆనంద్‌ తెల్తుంబే, పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖా, కబీర్‌ కలా మంచ్‌ సాంస్కృతిక బృందం సభ్యులు సాగర్‌ గోర్ఖే, రమేష్‌ గారుచోర్‌, జ్యోతి జగ్తాప్‌లు ఉన్నారు. వీరంతా శాంతియుత, రాజ్యాంగబద్ధమైన మార్గాల ద్వారానే కార్మికులు, మైనార్టీలు, దళితులు, గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.