
న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 29 సాయంత్రం ఢిల్లీలోని విజరు చౌక్‌లో నిర్వహించే బీటింగ్ రిట్రీట్ వేడుకలో 'అబిడ్ విత్ మి' కీర్తనను ఆలపిస్తారు. ఈ ఏడాది ఆ కీర్తనను ఆలపించనవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకంతో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన ఒకరోజు తరువాత తాజా నిర్ణయం చోటుచేసుకుంది. గాంధీకి అత్యంత ఇష్టమైన క్రైస్తవ కీర్తన 'అబిడ్ విత్ మి'. వేడుకల ముగింపులో మాస్డ్ బ్యాండ్లతో 1950 నుంచి ప్రతి సంవత్సరం ఆలపిస్తున్నారు. 2020లో కూడా ఈ ట్యూన్‌ను మొదట జాబితా నుంచి తొలగించారు. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో తుది జాబితాలో పునరుద్ధరించారు. అదనంగా 'వందేమాతరం' ట్యూన్‌ను ఆ ఏడాది చేర్చారు. బీటింగ్ రిట్రీట్ శతాబ్దాల సైనిక సంప్రదాయం. సూర్యాస్తమయ సమయంలో సైనికులు యుద్ధం నుంచి వైదొలిగిన రోజులను గుర్తు చేస్తుంది. బగ్గర్లు 'రిట్రీట్' వినిపించిన వెంటనే దళాలు పోరాటాన్ని నిలిపివేసి, తమ ఆయుధాలను కప్పి, యుద్ధభూమి నుంచి ఉపసంహరించుకుంటాయి.