Apr 30,2022 08:02

కేరళ లోని కన్నూర్‌ లో ఐదు రోజుల పాటు జరిగిన సిపిఐ (ఎం) 23వ అఖిల భారత మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరి 'ఫ్రంట్‌లైన్‌' ప్రతినిధి వెంకిటేష్‌ రామకృష్ణన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు.

పార్టీ అఖిల భారత మహాసభ సందర్భంగా మీ ప్రారంభోపన్యాసంలోనూ ముగింపు వ్యాఖ్యలలోనూ కొన్ని అంశాలు నొక్కిచెప్పారు. ప్రజలపై కుమ్మరించబడుతున్న ఆర్థిక కడగండ్లు, నిరంతరాయంగా సాగుతున్న మితవాద రాజకీయ మొగ్గు, హిందూత్వ ప్రాతిపదికన రాజకీయ విభజన, ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభం, పెచ్చు పెరుగుతున్న నిరుద్యోగం.. కార్యదర్శిగా మూడోసారి ఎన్నికైన మీరు వీటిని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు?
సిపిఎం ఈ సమస్యలపై స్థిరంగా పనిచేస్తూ వస్తున్నది. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంవత్సరం పాటు సాగిన రైతుల ఆందోళనలను, గడచిన దశాబ్ద కాలంలో వ్యవసాయ రంగ సంక్షోభానికి వ్యతిరేకంగా సాగిన అనేక పోరాటాలకు పరాకాష్టగా చెప్పవచ్చు. హైదరాబాద్‌లో జరిగిన గత మహాసభలో వ్యవసాయ రంగానికి చెందిన పోరాటాల గురించి ప్రత్యేకంగా చర్చించాం. 2018లో అఖిల భారత కిసాన్‌ సభ నేతృత్వంలో 'భూమి అధికార్‌ ఆందోళన్‌'లో 165 సంఘాలు ఐక్యంగా పనిచేసిన తీరును మహాసభ వివరించింది. నాలుగు సంవత్సరాల కాలంలో ఈ రైతాంగ పోరాటాలు, రైతు సంఘాలను, క్షేత్ర స్థాయి ఉద్యమాలను, వామపక్ష పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలను బలోపేతం చేసి, రైతాంగ ఐక్య ఉద్యమాలను తీవ్రతరం చేశాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంవత్సర కాలం సాగిన రైతుల ఆందోళన, పోరాటాల్లో ఆ కృషి ప్రతిబింబించింది.
పెరుగుతున్న నిరుద్యోగ సంక్షోభం, భారతదేశ జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. జనాభా పరంగా అధిక సంఖ్యాకులుగా ఉన్న యువతను మోడీ ప్రభుత్వం, బిజెపి నమ్మించి మోసం చేశాయి. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. వారి నమ్మక ద్రోహం పట్ల తమ ఆగ్రహావేశాలను యువత అనేకసార్లు వెల్లడించారు. అనేక సందర్భాల్లో ఏ సంస్థల ప్రమేయం లేకుండా, అప్రయత్నంగానే ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాలతో పాటు నిరుద్యోగ సమస్య, సంక్షోభాల గురించి కూడా జాతీయ మహాసభ చర్చించింది.
కరోనా మహమ్మారి ఉపాధి అవకాశాలను మృగ్యం చేసింది. ఉన్న ఉద్యోగాలను భారీగా తగ్గించి, నిరుద్యోగ సమస్య తీవ్రతను పెంచింది. కష్టాలు, బాధలను అనుభవిస్తున్న ప్రజలకు బిజెపి ప్రభుత్వం ఉపశమనం కలిగించకపోగా...పెట్రోలియం ఉత్పత్తులపై నిత్యం ఆర్థిక భారాలను మోపుతూ...ద్రవ్యోల్బణాన్ని పెంచింది. నిరుద్యోగం, పేదరికం, ఆకలి పెరిగిపోయి ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయి. కానీ మోడీ ప్రభుత్వం ఈ సమస్యల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ సమస్యలపై విశాల ప్రాతిపదికన భావసారూప్యత గల సంస్థలు, పార్టీలతో కలిసి పని చెయ్యాలని సిపిఎం మహాసభ తీర్మానించింది. రైతాంగ సమస్యలతో పాటు, మోడీ ప్రభుత్వం మోసపూరితంగా నెరవేర్చని వాగ్దానాల అమలు కోసం పోరాటాలను ఉధృతం చేయాలని నిర్ణయించింది.


ఈ ఉద్యమాలు, పోరాటాలు ఆయా సమస్యలను విధానాలను చట్టాలను ఎదుర్కోవడంలో ఎంత జయప్రదమైనా సరే, రాజకీయ ఎన్నికల రంగంలో ప్రతిబింబించేంత వరకూ వాటి ప్రభావం గట్టిగా కొనసాగుతుందని చెప్పగలరా? సిపిఎంతో సహా వామపక్షాలకు చెందిన మీరు ఎర్రజెండా ఆధ్వర్యంలో జరిగిన అనేక పోరాటాల గురించి చెబుతున్నారు గాని ఓటింగుకు వచ్చేసరికి ఉద్యమాలలో పాల్గొన్న వారి ఓట్లు కూడా కాషాయ జెండాలకూ ఆకుపచ్చ జెండాలకు పడుతున్నాయి. రైతుల ఆందోళనా పోరాటాల్లో కిసాన్‌ సభ ఎంతో చైతన్యంతో పాల్గొన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు రాజకీయంగా లబ్ధి పొందలేదు కదా!
సిపిఎం చేపట్టిన విప్లవ కర్తవ్యాలు విజయవంతం కావడానికి దగ్గర మార్గాలేవీ లేవని పార్టీకి తెలుసు. ప్రజల్లో హిందూత్వ మతతత్వ అస్తిత్వ భావజాలాన్ని ప్రచజలకు ఎక్కించేందుకు అవసరమైన కథనాలను సృష్టించడంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి లు విజయవంతమయ్యాయి. హింస, ద్వేషాల ద్వారా పదునెక్కుతున్న మతతత్వ ధ్రువీకరణలు భారతీయ సమాజాన్ని విభజిస్తున్నాయి. రాజకీయంగా, ఎన్నికలలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి లకు లబ్ధి చేకూర్చే ముఖ్యమైన ఆయుధమిదే. వాస్తవానికి, ప్రజల ముఖ్యమైన సమస్యలు, ఆర్థిక సంక్షోభాలపై ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తూనే మతతత్వ విభజనకు వ్యతిరేకంగా కూడా మేం పోరాడుతున్నాం. కానీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం లోని సంఫ్‌ు పరివార్‌ ప్రచార యంత్రాంగం...దేశంలోని అనేక ప్రాంతాలలో ప్రజలను విభజించే భిన్నమైన సమస్యలను ఒక క్రమపద్ధతిలో సృష్టిస్తున్నది.
కేవలం మూడు నెలల కాలంలో, కర్ణాటకలో హిజాబ్‌ సమస్యను ముందుకు తెచ్చి, దాన్ని దేశ వ్యాప్తంగా వ్యాపింపచేస్తున్నది. మేధాపరంగా విశాలభావ సంస్కృతికి కేంద్రంగా ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో సంఫ్‌ు పరివార్‌ గూండాలు దాడులు చేస్తున్నారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా మాంసాహారాన్ని తినకూడదనే పేరుతో వరుస దాడులకు తెగబడ్డారు. ప్రతీ చోట ప్రజాస్వామిక హక్కులపై దాడులకు పూనుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వారిపై కొన్ని దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ, మోడీ పాలనను వ్యతిరేకించే వారిని దేశ ద్రోహులని ముద్ర వేస్తూ నిర్బంధాలకు గురి చేస్తున్నారు. ఈ పరిస్థితులలో...భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, అనేక మంది త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన హక్కులను రక్షించుకోడానికి బిజెపి ని ఒంటరిని చేసి, ఓడించాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ, ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా, ఈ పోరాటం విజయవంతం కావడానికి దగ్గర మార్గాలేవీ లేవు.


మీరు బిజెపిని ఒంటరిని చేయాలని హెచ్చరిస్తూనే అదే సమయంలో కాంగ్రెస్‌ హిందూత్వ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకునేది తేల్చుకోవాలని, ముందు తమ అంతర్గత పరిస్థితిని చక్కదిద్దుకోవాలని అన్నారు!
అనేక రూపాల్లో కొనసాగుతున్న మతతత్వం, ముఖ్యంగా సంఫ్‌ు పరివార్‌ దూకుడుగా ప్రచారం చేస్తున్న హిందూత్వ మతతత్వం పట్ల రాజీలేని వ్యతిరేకత, లౌకికతత్వం పట్ల దృఢమైన నిబద్ధతల బలంతోనే మేమలా చెప్పాం. హిందూత్వపై వారి వైఖరి ఏంటి? హిందూత్వ మతతత్వం పట్ల మెతక వైఖరితో ఉన్నారా లేదా? అనేది స్పష్టం చెయ్యడానికి అంతగా గందరగోళ పడాల్సిన అవసరం లేదు. మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం (మతతత్వ మరియు కార్పొరేట్‌ బంధంతో) ప్రజలపై బహుముఖంగా దాడులు చేస్తుంది కాబట్టి ఈ స్పష్టత ఉండాల్సిన అవసరముంది. బిజెపి మరియు దాని మిత్రులతో పోరాటం చేస్తున్న వారందరూ ఈ పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరముంది.


అంటే దాని అర్థం 2024 ఎన్నికలలో జాతీయ స్థాయిలో లౌకిక ప్రత్యామ్నాయం సాధ్యం కానట్టేనా?
మన దేశ చరిత్రలో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటములు ఎన్నికల ఫలితాల తర్వాతే ఏర్పడ్డాయి. 1989, 1996, 2004లో ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినపుడు అదే జరిగింది. 1989లో వి.పి.సింగ్‌ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం మొదలు...ముఖ్యంగా 1996లో అటల్‌ బిహారి వాజ్‌పేయి నేతృత్వంలోని బిజెపి ఎన్‌డిఎ ప్రభుత్వం 13 రోజులకు పడిపోయిన తరువాతనే యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడింది. ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ ను రూపొందించాలని సిపిఎం ఆనాడే స్పష్టం చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ నాయకత్వాన 'కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని' రూపొందించడంలో మా పార్టీ అత్యంత ప్రముఖ పాత్రను పోషించింది. వాజ్‌పేయి నాయకత్వంలోని ఆరేళ్ల బిజెపి పాలనకు ప్రత్యామ్నాయంగా 2004లో యుపిఎ ఏర్పడినప్పుడు కూడా ఇదే జరిగింది.


బిజెపి కి ప్రత్యామ్నాయంగా లౌకిక ఫ్రంట్‌ ఏర్పాటులో కాంగ్రెస్‌ పార్టీ పాత్రపై హైదరాబాద్‌లో జరిగిన సిపిఎం అఖిల భారత మహాసభ నుండి తీవ్రమైన చర్చలకు, గందరగోళానికి దారితీసింది. ఈసారి కూడా లౌకిక ప్రత్యామ్నాయ ఏర్పాటులో కాంగ్రెస్‌ పార్టీ భాగస్వామిగా ఉండకూడదని చర్చించినట్లు సమాచారం ఉంది!
కాంగ్రెస్‌ పార్టీ పాత్ర విషయంలో సిపిఎం కు ఎటువంటి గందరగోళం లేదు. వాస్తవానికి, కన్నూర్‌ మహాసభ... హైదరాబాద్‌ మహాసభ రూపొందించిన పార్టీ వైఖరినే పునరుద్ఘాటించింది తప్ప ఎటువంటి కొత్త వైఖరిని సూచించలేదు. కాంగ్రెస్‌ పార్టీతో ఎటువంటి అవగాహన కానీ, ఎన్నికల పొత్తులు కానీ ఉండకూడదనే హైదరాబాద్‌ మహాసభ నిర్ణయించింది. కానీ, ప్రజా సమస్యలపై పార్లమెంటు లోపల, పార్లమెంట్‌ బయట, ప్రజా ఆందోళనల్లో కాంగ్రెస్‌ పార్టీతో ఎలా ఉండాలనే విషయాన్ని హైదరాబాద్‌ మహాసభ తెలియజేసింది. ఆ ప్రమాణాల మేరకే మేం కలిసి పని చేస్తాం.
ఎన్నికలకు సంబంధించినంత వరకు, బిజెపి వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా అవసరమైన ఎత్తుగడలను మా పార్టీ తగిన సమయంలో రూపొందిస్తుంది.