Sep 14,2021 21:42
  • సంఘటిత పోరాటాలతో తరిమికొట్టాలి....
  • మతోన్మాద శక్తులకు రాష్ట్రంలో చోటివ్వరాదు
  • బహిరంగ సభలో బివి రాఘవులు పిలుపు
  • 27 భారత్‌ బంద్‌ జయప్రదం చేయాలని విజ్ఞప్తి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కరోనాను నియంత్రించడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అందుకే ఆర్థిక వ్యవస్థ అడుగంటిపోయిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. 'దేశాన్ని బిజెపి అతి పెద్ద కరోనాలా పట్టుకుంది. దానిని తరిమికొడితేనే దేశం ముందుకు పోతుంది.' అని ఆయన చెప్పారు. 'బిజెపి విధానాలను ప్రతిఘటించండి-దేశాన్ని రక్షించండి' అను నినాదంతో మంగళవారం విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో సిపిఎం పశ్చిమ కృష్ణాజిల్లా కమిటీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి తీవ్ర హాని చేస్తున్న బిజెపి నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వ విధానాలను అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం పార్టీలు నిలదీయాలని కోరారు. మతతత్వ శక్తులకు తెలుగు గడ్డపై చోటివ్వరాదని విజ్ఞప్తి చేశారు. దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టాలనుదే బిజెపి లక్ష్యమని, ప్రజల సంక్షేమం కాదని అన్నారు. కరోనాను అడ్డుపెట్టుకుని కార్పొరేట్లు దేశాన్ని దోచుకునేందుకు మోడీ ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. కోవిడ్‌ వ్యాప్తి అదుపులోకి రావాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా కరోనాలా దేశాన్ని పట్టుకున్న బిజెపిని తరిమికొట్టడమే మార్గమని అన్నారు. పొరుగనే ఉన్నా చైనా వృద్ధిరేటులో దూసుకుపోవడానికి కారణం 69శాతం ప్రజలకు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయడమేనని చెప్పారు. అమెరికా కూడా 54 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్‌ వేసిందన్నారు. అనేక దేశాలు ఇదే విధంగా పెద్ద సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్‌ వేస్తున్నారని, మన దేశంలో మాత్రం కేవలం 17శాతం మందికే ఇప్పటివరకు వ్యాక్సిన్లు అందాయని వివరించారు. ఇదే పద్దతి కొనసాగితే దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్లు వేయాలను లక్ష్యం 2030కి కూడా పూర్తికావడం కష్టమని అన్నారు. రోజుకు కోటిన్నర మందికి వ్యాక్సిన్లు వేస్తేనే మూడో వేవ్‌ను తట్టుకోగలుగుతామని, లేనిపక్షంలో 4, 5 వేవ్‌లు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. ఈ ముప్పు తప్పాంటే బిజెపిని గద్దె దించాల్సిందేనని చెప్పారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. దీంతో ఓటమి భయం పట్టుకున్న బిజెపి పెద్ద ఎత్తున దాడులకు దిగుతోందని, ప్రజాతంత్ర, అభ్యుదయ శక్తులు, వ్యక్తులతో పాటు సిపిఎం కార్యాలయాలను, కార్యకర్తలను, నాయకులను లక్ష్యంగా చేసుకుంటోందని చెప్పారు. త్రిపురలో బిజెపి మతోన్మాద రాజకీయాలకు సిపిఎం అడ్డుకట్టవేయడంతో భరించలేక అక్కడి సిపిఎం రాష్ట్ర కార్యాలయంతో పాటు, పలు ఇతర కార్యాలయాలను ధ్వంసం చేశారన్నారు. త్రిపుర ప్రజలకు బిజెపి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, నిరంకుశ, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా త్రిపుర మాజీ సిఎం మాణిక్‌ సర్కార్‌ చేపట్టిన నిరసన ర్యాలీని నాలుగు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారని వివరించారు. ఈ అడ్డంకులను అధిగమించి నిరసన ర్యాలీని ప్రజలు జయప్రదం చేయడంతో కార్యాలయాలపై దాడులకుదిగుతునాురనిచెప్పారు. ఈ దాడుల తరువాత కూడా త్రిపురలో సిపిఎం ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. దేశంలో సరళీకరణ ఆర్థిక విధానాలు 1991లోనే ప్రారంభమైనప్పటికీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, వామపక్షాల పోరాటం కారణంగా 2014 వరకు ప్రభుత్వాలు వేగంగా వాటిని అమలు చేయలేకపోయాయని చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మతోన్మాద విధానాలతో ప్రజల దృష్టినిమళ్లించి సరళీకరణ ఆర్థిక విధానాలను పెద్ద ఎత్తున అమలు చేస్తోందని చెప్పారు. దీనిని ప్రతిఘటించిన వారిపై తీవ్ర నిర్బంధాన్ని మోపడంతో పాటు, దేశద్రోహం ఉపా చట్టం కింద కేసులు పెడుతున్నారని, స్టాన్‌స్వామి వంటి సామాజిక వేత్త ప్రాణాలను బలిగొన్నారని అన్నారు.

ఆర్థిక వ్యవస్థ పతనం...
మోడీ అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని, కరోనా వచ్చాక అది -13శాతానికి పడిపోయిందని రాఘవులు వివరించారు. ప్రపంచమంతా కరోనా దెబ్బకుఆర్థికంగా వెనుకబడినా మెల్లమెల్లగా వృద్ధిలోకి వస్తుంటే భారతదేశం ఆర్థిక వ్యవస్థ మాత్రం ఇంకా సున్నాలోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ప్రారంభం నుండి 2021 ప్రస్తుత కాలానికి ఆర్థిక వ్యవస్థలను చూస్తే ఇటలీ 3.9శాతం వృద్ధి, చైనా 11.5శాతం వృద్ధి, అమెరికా 2శాతం వృద్ధిలో ఉంటే భారతదేశం మాత్రం -9.2శాతంతో వెనుకబడి ఉందని వివరించారు. ఆర్థిక వ్యవస్థ పతనం వల్ల నిరుద్యోగం, దారిద్య్రం, ధరల పెరుగుదల, పోషకాహారలోపం, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, అమానవీయ ఘటనలు పెరుగుతున్నాయని, దీనిలో ప్రథమ ముద్దాయి బిజెపి ప్రభుత్వమని చెప్పారు.


మానిటైజేషన్‌ తో దేశానికి ద్రోహం
తాజాగా ప్రకటించిన మానిటైజేషన్‌ పైప్‌లైన్ తో దేశానికి ద్రోహం చేస్తున్నారని, ప్రజల ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని చెప్పారు. రోడ్లు, విద్యుత్‌ లైన్లు, డిస్కాములు, హైడ్రో, సోలార్‌ పవర్‌స్టేషన్లు, ఎఫ్‌సిఐ, సిడబ్ల్యుసి గోడౌన్లు, 400రైల్వే స్టేషన్లు, ప్యాసింజర్‌ రైళ్లు, గూడ్స్‌ షెడ్లు, రైల్వే కాలనీలు, రైల్వే స్టేడియంలు, ఫైబర్‌నెట్‌వర్క్‌, విమానాశ్రయాలు, టెలీఫోన్‌ టవర్లు, విశాఖపటుం పోర్టులో బెర్తులు ఇలా అన్నింటిని లీజు పేరుతో కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ ప్రజల ఆస్తులని, వీటని ప్రజలే ప్రతిఘటనలతో కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ చర్యల వల్ల లక్షలాది మంది ఉపాధి పోతుందని, పర్మినెంట్‌ ఉద్యోగాలు పోతాయని, రిజర్వేషన్ల ఊసే ఉండదని, దళిత,గిరిజనుల అభివృద్ధి ఆగిపోతుందని చెప్పారు.


తెలుగు గడ్డపై అవకాశం ఇవ్వకండి
బిజెపికి తెలుగు గడ్డమీద అడుగుపెట్టే అవకాశం ఇవ్వకూడదని, మతోన్మాద శక్తులను రాష్ట్రంలో ఓడించాలని రాఘవులు పిలుపునిచ్చారు. ఎపికి బిజెపి చేసిన ద్రోహంపై టిడిపి, వైసిపి పార్టీలు మోడీ చంకల్లో పిల్లుల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకుంటూ అసలు దొంగ బిజెపిని వదిలేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి విధానాలపై జనసేన అసలు నోరు మెదిపే పరిస్థితి లేదని అన్నారు.
సిపిఎం రాష్ట్రకార్యదర్శి పి మధు మాట్లాడుతూ 27న దేశవ్యాప్తంగా చేపట్టనున్న భారత్‌ బంద్‌లో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు టిడిపి, వైసిపిలు కలిసి రావాలని అన్నారు. ప్రజలంతా బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, వంటనూనెలు, నిత్యావసరాల ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రజలు కేంద్రంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. బహిరంగ సభకుసిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్‌ అధ్యక్షత వహించారు. పార్టీ పశ్చిమ కృష్ణానాయకులు బోజెడ్ల నాగేశ్వరరావు స్వాగతం పలికారు. కార్యక్రమంలో సిపిఎం పశ్చిమకృష్ణాకార్యదర్శి డివి కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు కె శ్రీదేవి, జిల్లా కమిటీ సభ్యులు బి రమణారావు, బి సత్యబాబు(విజయవాడ 50వ డివిజన్ కార్పొరేటర్‌), ప్రవీణ్‌, కె దుర్గారావు పాల్గొన్నారు.


త్రిపుర సంఘీభావ నిధికి విరివిగా విరాళాలు
త్రిపురలో బిజెపి దాడులకు దౌర్జన్యాలకు గురవుతున్న సిపిఎం నాయకులు, కార్యకర్తల మనోస్థైర్యానిు పెంచేందుకు, పార్టీ అభివృద్ధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని సిపిఎం కేంద్ర కమిటీ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం విదితమే. సభానంతరం రాఘవులు, మధు, బాబూరావు తదితర నేతలు జోలె పట్టి నిధులు సేకరించారు. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మొత్తానివ్వగా కొందరు చెక్కులను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా పోగేసి వచ్చిన మొత్తానిు త్రిపురకు పంపుతామని రాష్ట్ర కార్యదర్శి మధు ప్రకటించారు.

Read also: త్రిపురలో రాజ్యాంగం పని చేయటం లేదు : మాణిక్‌ సర్కార్‌

Read also: త్రిపురలో దాడులు ఆపాలి : సీతారాం ఏచూరి

బిజెపి ఓ కరోనా.... దాని విధానాలు హానికరం

బిజెపి ఓ కరోనా.... దాని విధానాలు హానికరంబిజెపి ఓ కరోనా.... దాని విధానాలు హానికరం