Aug 06,2022 23:34

మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి

- ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి
ప్రజాశక్తి- కె.కోటపాడు

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై వేధింపులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, హింసలు పెరిగాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి అన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో శనివారం మహిళలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాకుండా మనుధర్మాన్ని అమలు చేయడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తుందని విమర్శించారు. మహిళలు వంటింటి కుందేలు లాగా పడి ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థలు, బిజెపి పదే పదే చెబుతున్నాయన్నారు. ఎస్‌టి, ఎస్‌సిలపైనా, చివరికి భారత రాజ్యాంగంపైనా దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని, వాటిని నియంత్రించే చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. అనంతరం ఐద్వా మండల కమిటీ ఎన్నిక జరిగింది. ఆరిపాక చిన్నమ్మలు, రిక్కీ భవాని, ఎ.రామలక్ష్మి, జి.ఈశ్వరమ్మ, ఎం.మరియమ్మ కమిటీకి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయినబాబు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు డి.కుమారి, ప్రజా సంఘాల కన్వీనర్‌ ఎర్ర దేవుడు పాల్గొన్నారు.