Apr 07,2021 21:08
తిరుపతిలో రోడ్డు షో నిర్వహిస్తోన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

తిరుపతి ప్రతినిధి, గూడూరు (నెల్లూరు) : తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో బిజెపికి ఓటేస్తే మన గొయ్యి మనం తవ్వుకున్నట్లేనని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఒంటెద్దు పోకడలతో దేశాన్ని అధోగతి పాలు చేసిందని, కార్పొరేట్ల కొమ్ముకాస్తూ సామాన్యులను విస్మరిస్తోందని, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను అమలు చేస్తోందని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి ఎన్‌.యాదగిరిని గెలిపించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యాన చిత్తూరు జిల్లా తిరుపతిలోనూ, నెల్లూరు జిల్లా గూడూరులోనూ బుధవారం రోడ్‌ షోలు నిర్వహించారు. పి.మధు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాసేందుకు మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ, ఎల్‌ఐసి, రైళ్లు, విమానాలు, సముద్రాలు, అడవులు, గాలితరంగాలు సమస్తం ప్రయివేటీకరించేందుకు కంకణం కట్టుకుందని తెలిపారు. కేంద్రంలో బిజెపి చేసిన చట్టాలన్నింటినీ వైసిపి, టిడిపి ప్రభుత్వాలు బలపరిచాయన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో బిజెపిని ఆ పార్టీలు ఒక్క మాట కూడా అనడం లేదని తెలిపారు. ఇక్కడి నుంచి పోటీలో ఉన్న బిజెపి అభ్యర్థి గతంలో అనేక హోదాల్లో పనిచేశారని, అవినీతి చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని విమర్శించారు. కె.రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రిని చేస్తానంటూ జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ను బిజెపి మభ్యపెడుతోందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయని ప్రశ్నించారు. అధికార వైసిపి రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. సిపిఎం అభ్యర్థిని గెలిపిస్తే బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తారన్నారు. రోడ్డు షోలో సిపిఎం అభ్యర్థి ఎన్‌.యాదిగిరి, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, ఆర్‌పిఐ రాష్ట్ర అధ్యక్షులు పి.అంజయ్య, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.