Oct 14,2021 17:59

పూణె : బిజెపిలో చేరిన తర్వాత తనపై విచారణ లేమీ జరగలేదని, అందుకే తాను గాఢంగా నిద్రపోతున్నానంటూ మాజీ కాంగ్రెస్‌ నేత హర్షవర్ధన్‌ పాటిల్‌ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకున్న కేంద్రం సిబిఐ, ఇడి, ఎన్‌సిబితో దాడులు చేయిస్తుందంటూ ఎన్‌సిపి చీఫ్‌ శరద్‌ పవార్‌ విమర్శలు వచ్చిన తర్వాత పాటిల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పూణె జిల్లాలోని మావల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గన్న పాటిల్‌ మాట్లాడుతూ ' మేము కూడా బిజెపి గూటికి వెళ్లాల్సి వచ్చింది. అతడు ( ఆ కార్యక్రమంలో పాల్గన్న ప్రతిపక్ష నేతను ఉద్దేశించి) ఎందుకు బిజెపిలో చేరావని అడిగారు. నేనెందుకు బిజెపికి వెళ్లానో మీ నేతను అడుగు అని సమాధానం చెప్పా. బిజెపిలో చేరడం తేలిక. ప్రశాతంగా ఉంటుంది. అక్కడ విచారణలేమీ లేకపోవడంతో నేను హాయిగా నిద్రపోతున్నా' అని వ్యాఖ్యానించారు. పూణె జిల్లాలోని ఇందాపూర్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన పాటిల్‌.. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరారు.