Jan 14,2022 13:58

వాషింగ్టన్‌ : మైక్రోసాఫ్ట్‌ సహ-వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భాగస్వాముల సిఫార్సు మేరకు లైంగిక వేధింపులు, లింగ వివక్ష వంటి విషయాల్లో కంపెనీ విధానాలను సమీక్షించాలని నిర్ణయించింది. ఈ మేరకు 'అరెంట్‌ ఫాక్స్‌ ఎల్‌ఎల్‌పి' అనే న్యాయ విచారణ సంస్థను నియమించుకుంది. సమీక్షలో భాగంగా బిల్‌గేట్స్‌పై వచ్చిన ఆరోపణలపై బోర్డు జరిపిన దర్యాప్తును అరెంట్‌ సమీక్షించనుంది. 2007లో గేట్స్‌ మైక్రోసాఫ్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఓ మహిళా ఉద్యోగికి అభ్యంతర మెయిల్స్‌ పంపడమే కాకుండా.. బయట వ్యక్తిగతంగా కలవాలని ఆమెను ఆహ్వానించినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి విదితమే.
2019 తర్వాత బోర్డు సభ్యులు సహా ఇతర ఉన్నతస్థాయి వ్యక్తులపై వచ్చిన అన్ని రకాల వేధింపుల ఆరోపణల విషయంలో జరిపిన విచారణా ఫలితాలను అరెంట్‌ ఫాక్స్‌ పరిశీలించనుంది. అనంతరం బోర్డు, కంపెనీ యాజమాన్యానికి కొన్ని సిఫార్సులు చేయనుంది. వాటిని ఎలా అమలు చేయాలో కూడా సూచించనుంది. ఆ తర్వాత బోర్డు ఆ నివేదికను బహిర్గతం చేయనుంది. కంపెనీలో ఇలాంటి సమస్యలను ఎలా పరిష్కరించనుందో కూడా వివరించనుంది. ఈ నివేదిక బహుశా వేసవిలో వచ్చే అవకాశం ఉంది. దీనిపై మైక్రోసాఫ్ట్‌ సిఇఒ సత్యనాదెళ్ల మాట్లాడుతూ.. కంపెనీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఓ అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు.