Oct 13,2021 21:17

ముంబయి: టి20 ప్రపంచకప్‌లో పాల్గన్న టీమిండియా ఆటగాళ్ల కొత్త జెర్సీలను బిసిసిఐ విడుదల చేసింది. ఈ మెగా టోర్నీలో కోహ్లీసేన ఈ కొత్త జెర్సీలోనే కనిపించనుంది. 'బిలియన్‌ చీర్స్‌' అన్న నినాదంతో కొత్త జెర్సీని సోమవారం విడుదల చేశారు. క్రికెట్‌ అభిమానుల చీర్స్‌ ప్రేరణతో జెర్సీలను రూపొందించినట్లు బిసిసిఐ తన ట్విట్టర్‌లో వెల్లడించింది. టీమిండియా జట్టుకు కిట్‌ స్పాన్సర్‌గా ఎంపిఎల్‌ స్పోర్ట్స్‌ వ్యవహరిస్తుండగా.. అక్టోబర్‌ 24న కోహ్లిసేన పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే.
అక్షర్‌ స్థానంలో శార్దూల్‌
టి20 ప్రపంచకప్‌ టీమిండియా జట్టులో బిసిసిఐ ఒక మార్పు చేసింది. స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ స్థానంలో పేస్‌ బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను 15మంది సభ్యుల జట్టులోకి తీసుకొంది. దీంతో అక్షర్‌ స్టాండ్‌ బై జాబితాలోకి చేరాడు. ఐపిఎల్‌ ముగిసిన అనంతరం ముగ్గురు ఆటగాళ్లను యుఏఇలోనే ఉండాల్సిందిగా బిసిసిఐ ఆదేశించిన విషయం తెలిసిందే. వీరిలో సంజు శాంసన్‌, ఉమ్రన్‌ మాలిక్‌, అవేష్‌ ఖాన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లు ఐపీఎల్‌ తర్వాత కూడా టీమ్‌తోనే ఉండనున్నారు.