
ప్రజాశక్తి-కర్లపాలెం: ఉపాధి కూలీలను ఫొటో తీసే విధానాన్ని ఎత్తివేయాలని, అదేవిధంగా పనిచేసిన బిల్లులు వెంటనే వచ్చే విధంగా చూడాలని, ఆధార్ లింక్ కాకపోవటం వలన రద్దయిన జాబ్ కార్డులు పునరుద్ధరిం చాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్ అన్నారు. గురువారం కర్లపాలెం మండలంలోని యాజలి, బిడారు దెబ్బ, దూండివారిపాలెం గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు పనిచేసే పని ప్రదేశాలకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండు పూటలా పని, రెండు ఫొటోలు పేరుతో వ్యవసాయ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీకి తక్కువ నిధులు కేటాయించి కూలీల ఉసురు తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకాలంలో 47 డిగ్రీల ఎండలో ఉదయం 10 గంటల దాకా పని చేయాలంటున్నారని, సాయంత్రం 3గంటల నుంచి పని చేయాలంటున్నారని, వడ దెబ్బకు కూలీల ప్రాణాలు పోతుంటే టెంట్లు, మంచినీరు, మెడికల్ కిట్లు లాంటివి ఏవీ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఒకే వర్క్ ఐడితో కూలీలందరూ ఒకే చోట పని చేయటం వల్ల పని చేసిన వారికి, చేయని వారికి ఒకే రకంగా డబ్బులు పడుతున్నాయని, ఇది సరయింది కాదని కూలీలు వివరించారు. రెండు పూటలా పని, రెండు ఫొటోల విధానం తీసివేయాలని, 200 రోజుల పని రూ.600 కూలి ఇవ్వాలని, మంచినీరు లేదా మజ్జిగ ఇవ్వాలని డిమాండ్ చేశారు.