Jan 13,2022 20:53

రూ.90వేల కోట్లు వెచ్చిస్తాం : అనీల్‌ అగర్వాల్‌
న్యూఢిల్లీ  :   
ప్రభుత్వ రంగంలోని భారత పెట్రోలియం కార్పొరేషన్‌ (బిపిసిఎల్‌)ను స్వాధీనం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నామని వేదాంత గ్రూపు ఛైర్మన్‌ అనీల్‌ అగర్వాల్‌ తెలిపారు. '' బిపిసిఎల్‌ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ 11-12 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.83-90 వేల కోట్లు)గా ఉంది. మేము ఇదే సరైన విలువకు బిడ్డింగ్‌ వేశాము'' అని అగర్వాల్‌ ఓ ఇంటర్యూలో తెలిపారు. మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ సంస్థను కార్పొరేట్‌ శక్తులకు విక్రయించడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇందులోని ప్రభుత్వానికి ఉన్న 53 శాతం వాటాను అమ్మకానికి పెట్టింది. బిపిసిఎల్‌ ప్రస్తుత మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.84,827 కోట్లుగా ఉంది. వచ్చే మార్చిలో కేంద్రం బిడ్లను తెరిచే అవకాశం ఉందని అగర్వాల్‌ పేర్కొన్నారు. ఇతర వ్యాపారాల గురించి కూడా అగర్వాల్‌ మాట్లాడుతూ జాంబియాలోని తమ రాగి యూనిట్‌ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 3 బిలియన్‌ డాలర్లు (రూ.22,500 కోట్లు) పెట్టుబడులు పెట్టామన్నారు. సౌదీ అరేబియాలోని జింక్‌ మైనింగ్‌ ప్రాజెక్టుల్లో తమ సంస్థకు అవకాశాలున్నాయన్నారు.