Jul 21,2021 20:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నిధులు, అధికారాలున్న పదవులను సిఎం తన సొంతవారికి కట్టబెట్టి, బడుగు బలహీన తరగతుల వారికి కనీసం కుర్చీలు కూడా లేని చైర్మన్‌ పదవులను కేటాయించారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ నిరుద్యోగులకు పదవులు కట్టబెట్టడంపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై సిఎంకు లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్లలో కోత పెట్టి 16,800 మందికి రాజకీయ అవకాశాలను దెబ్బతీశారని ఆరోపించారు. పెరిగిన నిత్యావసర ధరలు, సిఎం తీరును నిరసిస్తూ గురువారం నుంచి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో నిరసనలు, ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆ విభాగం అధ్యక్షులు వంగలపూడి అనిత విలేకరుల సమావేశంలో తెలిపారు. సిఎం కార్యాలయాన్ని మరోసారి ముట్టడిస్తామని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్‌ చిన్నబాబు, టిఎన్‌ఎస్‌ అధ్యక్షులు ప్రణవ్‌ గోపాల్‌ తెలిపారు. నిరుద్యోగులను మోసం చేసిన సిఎం జగన్‌పై ఏం కేసులు పెట్టాలని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. యువత, నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను సిఎం తక్షణమే తొలగించాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విలేకరుల సమావేశంలో డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ అండదండలతోనే బాక్సైట్‌ : నక్కా
విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతంలో ప్రభుత్వ పెద్దల అండదండలతో లాటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ ఖనిజ సందపను కొందరు కొల్లగొడుతున్నారని టిడిపి మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను రూ.344.93 కోట్ల విద్యుత్‌ బిల్లుల చెల్లింపు పేరుతో కాజేశారని టిడిపి రైతు విభాగం అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.