Oct 12,2020 07:40

నాట్యకళా ప్రపూర్ణ బళ్లారి రాఘవ రాసిన ఏకైక నాటకం 'సరిపడని సంగతులు'. 1933లో తొలిసారిగా ప్రచురింపబడ్డ ఈ నాటకం 84 ఏళ్ల తర్వాత (2017) కాని మలి ముద్రణా భాగ్యానికి నోచుకోలేకపోవటం దురదృష్టకరం. డాక్టర్‌ అప్పిరెడ్డి హరినాథరెడ్డి ప్రయత్న ఫలితంగా ప్రజాశక్తి బుకహేౌస్‌ 2017లో ఈ పుస్తకాన్ని పున్ణ ముద్రించింది. రాఘవ ఈ నాటకాన్ని మూడు అంకాలుగా విభజించారు. మొదటి అంకంలో మూడు, రెండో అంకంలో ఐదు, మూడో అంకంలో మూడు రంగాలు ఉన్నాయి. రాఘవ ఈ సాంఘిక నాటకంలో సరళ గ్రాంథికం వాడారు. సహజమైన వాడుక భాష ఎక్కడా కనబడదు.
ఇది దీర్ఘకాలంగా పట్టి పీడిస్తోన్న బాల్య వివాహం, బాల వితంతువుల దురవస్థ, విధవా వివాహం సమస్యలపై సంస్కరణోద్దేశ్యంతో రాయబడ్డ నాటకం. కందుకూరి వీరేశలింగం గారి అవిశ్రాంత కృషి వల్ల బ్రాహ్మణ కుటుంబాల్లో బాల వితంతువుల పునర్వివాహాలు అక్కడక్కడ జరుగుతున్నా, రాయలసీమ ప్రాంతంలో అవి చాలా సకృత్తుగానే జరిగేవని చెప్పొచ్చు. బ్రాహ్మణ కులంలోని త్రిమతస్థుల్లో ద్వైతులైన మాధ్వుల్లో మడి, ఆచారాలు, మత గురువుల ఆధిపత్యం ఎక్కువ. అందువల్లే రాఘవ మాధ్వ కుటుంబంలోని వ్యక్తుల్ని పాత్రలుగా స్వీకరించి ఈ సాంఘిక నాటకం రాశారు. సంప్రదాయ కుటుంబానికి చెందిన బళ్లారి రాఘవ తమ ఆంగ్ల విద్య సంస్కారం చేత ప్రభావితులై, బాల వితంతువుల పునర్వివాహం అవసరమనీ, స్త్రీ పక్షపాతిగా, సంఘ సంస్కరణాభిలాషిగా ఈ నాటకం రచించి, ప్రదర్శించి, తెలుగు నాటకరంగంలో కొత్త మలుపు తిప్పారని ఘంటాపథంగా ఘోషింపవచ్చు.
ఈ నాటకం కథా వస్తువును సంక్షిప్తంగా తెలుసుకొందాం.
వకీలు భీమసేనరావు మేనకోడలు తార బాలవిధవ... ఆయన కుమారుడైన రాజారావు వల్ల గర్భవతి కావడం - భీమసేనరావుకు పెద్ద సమస్య అయి కూర్చొంది. లౌక్యుడైన రావు మత గురువులకు భూరి దక్షిణ ఇచ్చి తారకు కేశఖండనం చేయించకుండా గండం గడిచి గట్టెక్కాడు. ప్రస్తుతం ఆయన ఎంత చెప్పినా తార గర్భస్రావం చేయించుకోవడానికి సమ్మతించలేదు. తారకు కడుపు తెప్పించిన రాజా ఆమెను పెళ్లి చేసుకోవాలనే నిశ్చయించుకున్నాడు. కాని, మీనమేషాలు లెక్కిస్తున్నాడు. భీమసేనరావు గుమాస్తా శ్రీధర శాస్త్రి యువకుడు, సంస్కారవంతుడు, నిజాయితీపరుడు. అతను తార, రాజాల పెళ్లి చేయించాలని ప్రయత్నిస్తాడు. ఈ విషయం తెలిసి భీమసేనరావు కోపగించి శ్రీధరుణ్ణి పని నుంచి తొలగిస్తాడు. అప్పుడతను రాజా వీరణ్ణశెట్టి వద్ద గుమాస్తాగా చేరుతాడు.
వీరణ్ణశెట్టి ఇంట్లో చంద్రహారం చోరీ జరిగింది. మత గురువు విద్యాలంకారాచార్యుల సూచన మేరకు భీమసేనరావు పనిమనిషి యెల్లప్ప ద్వారా చంద్రహారంలోని పదకం శ్రీధర శాస్త్రి ఇంట్లో దాచబడుతుంది. తార శ్రేయోభిలాషి అయితే శ్రీధరశాస్త్రి జైలుకు పోతే తార అనాథయై, తన కొడుకు రాజాకు దూరమై పోగలదనీ లాయరు ఈ పన్నాగం. భీమసేనరావు గారి కొడుకు రాజా శ్రీధరశాస్త్రి నిరపరాధుడని సాక్ష్యం చెప్పి అతని విడుదలకు కారణమవుతాడు. తర్వాత పెద్దలందరి సమ్మతితో తార, రాజాల పెళ్లి జరుగుతుంది. సరిపడని సంగతులు సరితూగుతాయి. అలా నాటకం సుఖాంతం అవుతుంది.
బళ్లారి రాఘవ సమకాలీన బ్రాహ్మణ సమాజాన్ని తొలుస్తున్న బాల విధవల దుస్థితిని, వితంతువుల పునర్వివాహ ఆవశ్యకతను ఈ నాటకంలో నొక్కి చెప్పారు. నాటకకర్త తమ నాటకానికి 'సరిపడని సంగతులు' (ఖీaష్‌ర ఖఅజూశ్రీవaఝఅ్‌) అని నామకరణం చేశారు. కాని శీర్షిక కంటే తీవ్రమైన, సాంఘిక దురాచారాల్ని నాటకకర్త ఈ నాటకంలో చిత్రించారు. రాఘవ పనిలో పనిగా సంప్రదాయస్థ బ్రాహ్మణుల డాంబికతను, దురహంకారాన్ని, కపటతనాన్ని, మతాచార్యుల ద్వంద్వ రూపాల్ని, వకీళ్ల దుష్టబుద్ధిని, పోలీసు అధికార్ల, ఉద్యోగస్తుల లంచగొండి తనాన్ని, యువత దురలవాట్లను కూడా తెరమీదికి తెచ్చారు. వితంతువుల పునర్వివాహాన్ని సమర్థించే సంస్కారవంతురాలు లీలావతీ దేవిని, యువకుడైన శ్రీధరశాస్త్రిని, భాస్కరుడిని, రాజాను ఒకవైపు చిత్రిస్తే, స్త్రీని గుప్పెట్లో పెట్టుకొని, సంఘంలో ఊరేగాలనే ధోరణిగల భీమసేనరావు, విద్యాలంకారాచార్యులు, రఘునాథాచార్యులను మరోవైపు చిత్రించారు. చిట్టచివర్లో సంస్కరణవాదులదే పైచేయి అయినట్లుగాను, గొడ్డు సంప్రదాయ వాదుల్లోనూ మన్ణ పరివర్తనం కలిగినట్లు చిత్రించారు. వకీలు భీమసేనరావు భార్య లీలావతి గర్భవతి తారాబాయిని కోడలిగా స్వీకరించాలని భర్తకు ధైర్యంగా ఇలా సలహా ఇస్తుందని- ''తప్పు చేసినవాడు నీ కుమారుడే గదా! వాని తండ్రి అయిన మీరు, ఆ తప్పుకై అమాయకురాలగు మేనకోడలిని శిక్షించుట కన్న, ఆ తప్పులోని పొరబాటును తొలగించి, తప్పును ఒప్పుగా మార్చడం మేలు కదా!'' (పేజీ 59) అలాగే నేటి హిందూ సమాజం స్త్రీల పట్ల అన్యాయంగా, క్రూరంగా ప్రవర్తిస్తుందని యువకుడైన శ్రీధరశాస్త్రిని అభ్యుదయ భావాలు కల ఆదర్శమూర్తిగా నాటక రచయిత చిత్రించడం మనం చూడొచ్చు. ''దుర్భలమగు ఈనాటి హైందవ సంఘ ధర్మముచే మోసగింపబడి, సంకటములకు గురైన నిరపరాధి అయిన ఈ పడుచు 'భ్రష్ట యనిపించుకొనును. మోసము చేసి మీసముల దువ్వుచుండు హీనుడు శిష్టుడనిపించు కొనును.'' (పేజీ 35) శ్రీధరశాస్త్రి ఈ మాటలు అతను వర్తమాన సంఘపునాడిని కనిపెట్టినట్లు తెలియజేస్తున్నాయి. రాఘవ తన ఉదాత్త ఆశయాన్ని, సంఘ సంస్కరణాభిలాషను వ్యక్తం చేసేందుకు సంభాషణల్ని సాధనాలుగా చేసుకున్నారు. నాటకకర్త సంభాషణల్ని కొన్నిచోట్ల వ్యంగ్యంగానూ, ఇంకొన్నిచోట్ల సూటిగానూ నిర్వహించారు. న్యాయస్థానాలు అన్యాయాలకు, అక్రమాలకు గురైన వారికి న్యాయం చేకూర్చ లేవనీ, అవి ధనవంతుల, బలవంతుల పక్షమే వహిస్తాయనీ శ్రీధరశాస్త్రి నోట ఇలా చెప్పిస్తారు : ''కోర్టులా? వకీళ్ల బతుకు కొరకు, ధనవంతుల దుర్మార్గం కొరకు, ఇచ్చట చెల్లునది మాటల లాఘవము; మూటల బరువు ఇచ్చట దుడ్డుగలవారికే న్యాయంగాని, బీదల నడుగువారు లేరు.'' (పేజీ 80). కొన్ని సంభాషణలు శక్తిమంతంగానూ, సామాజిక వాస్తవికతను తెలియజేసేవిగా వున్నా, కొన్నిచోట్ల అవి చాలా పొడవుగా, అతికినట్లు ఉండటం లోపమే. ప్రసిద్ధ విమర్శకులు కట్టమంచి రామలింగారెడ్డి గారు ఈ విషయాన్ని రాఘవ గారికి 1945 డిసెంబర్‌ 6వ తేదీన రాసిన ఉత్తరంలో వ్యక్తపరిచారు. అంకాలు ఎక్కువగా ఉన్నాయనీ, సంభాషణల్లో ఉపదేశాత్మకత ఎక్కువగా వుందనీ, ప్రదర్శనీయత కొరవడిందనీ, చదివేందుకు మాత్రం బాగుంటుందనీ కట్టమంచి అన్న మాటలు గమనార్హం. ఏదేమైనా ఈ నాటకం బళ్లారి రాఘవ అభ్యుదయ దక్పథానికి తార్కాణం.
- ఘట్టమరాజు
99640 82076