Jul 21,2021 21:01
మాట్లాడుతున్న లోకనాథం

ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ (విశాఖ) : విశాఖలో బలవంతపు భూసేకణను నిలిపివేయాలని, బెదిరించి సంతకాలు తీసుకోవడం తగదని భూ సేకరణ, ల్యాండ్‌ పూలింగ్‌ రైతు, కూలీ, నిర్వాసితుల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా కార్యదర్శి కె.లోకనాథం అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం పది మండలాల పరిధిలోని 55 గ్రామాల్లో పేదలు సాగుచేసుకుంటున్న 6,116.50 ఎకరాల భూమిని హైకోర్టు స్టే ఉన్నా ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో మళ్లీ లాక్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. భూ సేకరణ చట్టం 2013కు భిన్నంగా విశాఖలో ల్యాండ్‌ పూలింగ్‌ వెనుక ఆంతర్యమేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటున్న పేదలను ఆక్రమణదారులుగా ముద్రవేయడం అన్యాయమన్నారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే విశాఖ జిల్లాలో కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు గంటా శ్రీరామ్‌, కోశాధికారి జి.నాయనబాబు పాల్గొన్నారు.