Jul 21,2021 19:10

దేశద్రోహం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న రైతులను విడుదల చేయడానికి ప్రభుత్వంతో మూడుసార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో.. రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. బుధవారం ఉదయం 9-11గంటల వరకు రెండు గంటలపాటు భవదీన్‌లోని జాతీయ రహదారి-9 పై బైఠాయించారు. అలాగే ఖుయాన్‌ మల్కానాతోపాటు, పంజువానా గ్రామానికి సమీపంలో ఉన్న రోడ్లను కూడా బ్లాక్‌ చేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో... వాహనదారులు ఇబ్బందులనెదుర్కొన్నారు. అయితే అత్యవసర సేవలైన అంబులెన్స్‌, సైనిక వాహనాలకు మినహాయింపునిచ్చారు.
ఇక మినీ సెక్రటేరియట్‌ వెలుపల ప్రధాన ద్వారం వద్ద ఉన్న రైతుల ధర్నా ఐదవ రోజుకి చేరింది. రైతు నాయకుడు బల్దేవ్‌సింగ్‌ సిర్సా ప్రారంభించిన ఉపవాస దీక్ష నాలుగో రోజుకి చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి పరీక్షించిన వైద్య బృందం ... బరువులో హెచ్చు తగ్గులు వచ్చాయని నివేదించింది. దీనిపై మీడియాతో బల్దేవ్‌సింగ్‌ సిర్సా మాట్లాడుతూ... 'రైతులను విడుదల చేసే వరకూ నా దీక్ష కొనసాగుతుంది. వారిని విడుదల చేస్తేనే నా దీక్షను విరమిస్తాను. నాకు ఏదైనా జరిగితే ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షా, వ్యవసాయమంత్రి నరేంద్ర తోమర్‌లదే బాధ్యత' అని అన్నారు. మరో రైతు నాయకుడు లఖ్విందర్‌ సింగ్‌ లా ప్రహ్లాద్‌సింగ్‌ ఛారుఖారా మాట్లాడుతూ.. ప్రభుత్వం వినిపించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.