Feb 06,2023 23:51

అర్జిదార్ల నుండి సమస్యలు వింటున్న ఎఎస్‌పి బిందుమాధవ్‌

ప్రజాశక్తి - నరసరావుపేట : జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో అదనపు ఎస్పీ జి.బిందుమాధవ్‌ పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 93 ఫిర్యాదులు అందగా వాటి పరిష్కారానికి అధికారులను ఎఎస్‌పి ఆదేశించారు. డీఎస్పీలు విజయభాస్కర్‌రావు, జయరాం ప్రసాద్‌, రవిచంద్ర, ఆదినారాయణ, సిఐ సుభాషిణి, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
కోడలు, ఆమె ప్రియుని నుండి మనవరాలికి ప్రాణహాని
తన కోడలు, ఆమె ప్రియుడి నుండి మనవరాలికి ప్రాణహాని ఉందని వినుకొండ మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన మాచర్ల మోహన్‌రావు ఫిర్యాదు చేశారు. తన పెద్దకుమారుడు సుధీర్‌కుమార్‌కు తన చెల్లెలు కుమార్తె మేరి సుచరితకు 18 ఏళ్ల కిందట వివాహైందని, వారికి ఒకబ్బాయి, ఒకమ్మాయి ఉన్నారని తెలిపారు. అయితే తన కుమారుడు చనిపోయాడని, కోడలు నరసరావుపేటలో తపాలా కార్యాలయంలో ఉద్యోగం చేస్తుందని, ఆమె బాపట్ల జిల్లా అద్దంకి మండలం శంకరాపురానికి చెందిన అనపర్తి మహేంద్రతో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిపారు. తన మనవరాలిపై మహేంద్ర పలుమార్లు అత్యాచారం చేశాడని, ఈ విషయాన్ని మేరి సుచరితకు చెప్పినా పట్టించుకోపోగా అతనిపక్షానే మాట్లాడుతూ మనవరాలిని కొడుతోందని, దీనిపై తాము నరసరా వుపేట ఒన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. తన కుమారుని మరణంపైనా అనుమానం ఉందని చెప్పాడు.
చెల్లెలే మోసం చేసింది
తన చెల్లెలు లకీëసుశీల కుమార్తె అయిన లకీëప్రియ ఉన్నత చదువుల కోసం, ఆమె విదేశాలకు వెళ్లడా నికి లోను కోసమని తన ఇంటిని ఏడేళ్ల కిందట రిజిస్ట్రేషన్‌ చేశామని, ఆమె ఆస్ట్రేలియాలో స్థిరపడిందని అయినా తన ఇంటిని తనకు రిజిస్టర్‌ చేయడం లేదని నరసరావుపేటలోని ఎన్‌జిఒ కాలనీకి చెందిన పామిశెట్టి విజయకుమారి ఫిర్యాదు చేశారు. దీనిపై తాను టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, పైగా చెల్లెలు మరిది వచ్చి దుర్భాషలాడి దాడి చేశారని వాపోయారు.
స్థలాన్ని కబ్జా చేసిన హోం గార్డు
చిలకలూరిపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న రమేష్‌ తన ఇంటి ప్రాంగణంలోని స్థలాన్ని కబ్జా చేశాడని చిలకలూరిపేట తూర్పుమాలపల్లికి చెందిన వడ్లాడ నాగేంద్రమ్మ అనే వృద్ధురాలు ఫిర్యాదు చేశారు. దీనిపై తాను ప్రశ్నిస్తే పొరాపాటైందని ఒకసారి, డబ్బులిస్తానని మరోసారి చెప్పాడని, ఇప్పుడు ఇప్పుడు ఖాళీ చేయను.. ఏం చేసుకుంటావో చేసుకో.. అని బెదిరిస్తున్నాడని వాపోయారు.
భార్య, కుమార్తె ఆచూకీ కనిపెట్టండి
తన భార్యకు మరోవ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, వారిద్దరూ కలిసి తన కుమార్తెను తీసుకుని వెళ్లిపోయారని వినుకొండ మండలం చాట్రగడ్డపాడుకు చెందిన గుర్రం గురవయ్య ఫిర్యాదు చేశారు. వీరు నరసరావుపేట ప్రాంతంలో నివాసం ఉంటున్నారని తెలిసిందని, తల్లి, చెల్లి కోసం కుమారుడు దిగులు పెట్టుకున్నాడని, వారి ఆచూకిని కనిపెట్టి తమ వద్దకు చేర్చాలని కోరారు. దీనిపై పోలీసులకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వెలిబుచ్చారు.
పొలాన్ని మరిది కాజేశాడు
తన భర్త ద్వారా తమకు రావాల్సిన నాదెండ్ల మండలం చందారంలో అరెకరం పొలానికి తన మరిది రాజు నకిలీ పత్రాలు సృష్టించి కాజేశాడని ఫిరంగిపురం మండలం పొనుగుపాడుకు చెందిన కూరపాటి రోశమ్మ ఫిర్యాదు చేశారు. ఆ భూమిని మరిది గతంలో కౌలుకు సాగు చేసుకునేవాడని, ఇటీ వల తన భర్త మృతితో కౌలుకూడా ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నాడని, ప్రశ్నిస్తే దాడి చేశారని వాపోయారు.
ప్రభుత్వ స్థలాన్ని విక్రయించి మోసం
తనను మోసం చేసి ప్రభుత్వ భూమిని విక్రయించారని వినుకొండ పట్టణానికి చెందిన పొల్లా నరసయ్య ఫిర్యాదు చేశారు. తన స్నేహితు వలపర్ల సుబ్బయ్య ద్వారా మక్కెన శ్రీనుకు చెందిన వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో 3 సెంట్ల స్థలాన్ని ఏడేళ్ల కిందట రూ.1.46 లక్షలకు కొన్నానని, రిజిస్ట్రేషన్‌ కూడా చేయించానని తెలిపారు. అయితే అది ప్రభుత్వ స్థలమని తెలిసిందని, డబ్బు తిరిగివ్వాలని అడుగుతుంటే ఇవ్వడం లేదని తెలిపారు. బిఎస్‌ఎన్‌ఎల్‌లో పని చేస్తూ రిటైరైన డబ్బుతో ఆ స్థలాన్ని కొన్నానని, వృద్ధాప్యంలో ఉన్న తమకు ఇప్పుడు డబ్బు చాలా అవసరమని ఆవేదనకు గురయ్యారు.
ఆస్తిని కాజేసిన కుమారులు ఓ గదిలో పెట్టారు
ఆస్తిని, ఇంటిని తమ పేరున రాయించుకున్న ఇద్దరు కుమారులు తన పోషణ భారంగా భావించి గుంటూరులో ఒక చిన్న అద్దె గదిలో ఉంచి పట్టించుకోవడం లేదని సత్తెనపల్లి మండలం పెద మక్కెనకు చెందిన దొంతిరెడ్డి వెంకటరావమ్మ ఫిర్యాదు చేశారు. పెద్ద కొడుకు వ్యాపారం నిమిత్తం హైదరాబాద్‌లో స్థిరపడగా చిన్న కుమారుడు గుంటూరు సమీపంలో దాసరిపాలెంలో ఉంటున్నాడని తెలిపారు. తన భర్త పెద్ద కొడుకు వద్ద ఉంటూ 2021లో చనిపోతే చివరి చూపు కూడా చూడనివ్వలేదని, వృద్ధాప్యంలో ఉన్న తనను కొడుకులు, మనవళ్ల వద్ద జీవించే ఏర్పాటు చేయాలని కోరారు.
ధాన్యం కొని రూ.30 లక్షల ఎగనామం
తమ వద్ద 6 లారీల ధాన్యం కొనుగోలు చేసిన క్రోసూరు మండలం చట్టుబోడు తండాకు చెందిన బాజీనాయక్‌ రూ.30 లక్షలు డబ్బులు ఇవ్వడం లేదని దొడ్లేరుకు చెందిన 18 మంది రైతులు ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసం వ్యాపారి ఇంటికెళ్లి అడిగితే మిల్లర్‌ ఐపి పెట్టాడు.. మేమేమీ చేయలేం.. అంటూ అతని భార్య చెబుతోందని, క్రోసూరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సరిగా పట్టించుకోవడం లేదని వాపోయారు.
దీనిపై కౌలురైతు సంఘం క్రోసూరు మండల కార్యదర్శి టి.హనుమంతరావు మాట్లాడుతూ ధాన్యం అమ్మిన డబ్బులను మిల్లర్‌ వద్ద ధాన్యం వ్యాపారి బాణావత్‌ బాలాజీ నాయక్‌ తీసుకున్నాడని, కానీ అ డబ్బును రైతులకు ఇవ్వలేదని చెప్పారు. అతనికి పంట అమ్మిన బాధితుల్లో ధాన్యంతోపాటు మిర్చి, పత్తి రైతులూ ఉన్నారని తెలిపారు. బాలాజీనాయక్‌ రైతులను ఉద్దేశపూర్వకంగానే మోసం చేసినట్లు తమ పరిశీలనలో తేలిందని, అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయాలని, సొత్తును రైతులకు ఇప్పించాలని కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామని చెప్పారు. బాధిత రైతుల్లో ఎక్కువమంది కౌలురైతులే ఉన్నారన్నారు.