Jan 14,2022 17:12

అక్కినేని నాగార్జున నటించిన సినిమాల్లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయన'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'బంగార్రాజు' చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న శుక్రవారం విడుదలైంది. తండ్రీ- కొడుకులైన నాగార్జున, నాగచైతన్య ఈ చిత్రంలో తాత మనవళ్లుగా నటించారు. గతంలో వీరిద్దరూ కలిసి 'మనం' సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ డూపర్‌ హిట్‌కొట్టింది. మరోసారి తెరను పంచుకున్న తండ్రీ కొడుకుల్దిరూ బంగార్రాజు చిత్రంతో.. ప్రేక్షకుల్ని మెప్పించారో లేదో తెలుసుకుందామా..?!

121


కథ
'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం ఎక్కడ ముగిసిందో.. బంగార్రాజు కథ అక్కడి నుంచే మొదలవుతుంది. బంగార్రాజు (నాగార్జున) కొడుకైన రాముకు బిడ్డ పుట్టిన తర్వాత భార్య సీత పురిట్లోనే చనిపోతుంది. ఇక ఆ బిడ్డను తల్లి సత్తెమ్మ (రమ్యకృష్ణ)కు ఇచ్చి రాము మళ్లీ అమెరికాకు వెళ్లిపోతాడు. సత్తెమ్మ మనవడికి భర్తపేరు బంగార్రాజు (నాగచైతన్య) పేరే పెట్టుకుని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. తీరా బంగ్రారాజుకు పెళ్లి వయసొచ్చేసరికి సత్తెమ్మ కూడా చనిపోయి స్వర్గంలో ఉన్న తన భర్త బంగార్రాజు (నాగార్జున) వద్దకే వెళుతుంది. సత్తెమ్మ చనిపోవడంతో.. బంధువులంతా మోసాలకు పాల్పడతారు. చివరకు చిన్న బంగార్రాజుని చంపడానికి కొంతమంది శత్రవులు తయారవుతారు. అయితే చిన్న బంగార్రాజు ఇవేవీ పట్టించుకోకుండా.. తాత మాదిరే అమ్మాయిల వెంటపడుతూ.. ఊర్లో ఆవారాగా తిరుగుతాడు. ఈ క్రమంలో బంగార్రాజుకి.. మరదలు నాగలక్ష్మీ (కృతిశెట్టి)కి, పెళ్లి చేయాలని సత్తెమ్మ భావిస్తుంది. అయితే ఒకరంటే ఒకరికి పడని.. బావా మరదళ్ల మధ్య ప్రేమ చిగురించేలా చేయడానికి సత్తెమ్మ బంగార్రాజు స్వర్గం నుంచి భూమ్మీదకు వస్తారు. భూమ్మీదకు వచ్చిన బంగ్రారాజు సత్తెమ్మ కోరుకున్న అమ్మాయితోనే చిన్న బంగార్రాజుకి పెళ్లి చేశాడా? శత్రువుల నుంచి చిన్న బంగార్రాజుని కాపాడాడా? అలాగే ఊరి గుడి కింద ఉన్న నిధుల్ని దుష్టశక్తుల నుంచి ఎలా కాపాడాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

3214


విశ్లేషణ
2016లో సంక్రాంతికి విడుదలైన 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా దర్శకుడు కల్యాణ్‌కృష్ణ తెరకెక్కించారు. ఇక చిత్రయూనిట్‌ కూడా సోగ్గాడే చిన్నినాయన కంటే... అంతకుమించి అన్నట్లుగా ప్రచారం చేయడంతో... ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయింది. అలాగే ఈ సిమాలో నాగ్‌, చై కలిసి నటించడంతో చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఒక చిత్రానికి సీక్వెల్‌ అంటే.. పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు కొన్ని ఆటోమేటిగ్గా ఉంటాయి. ప్రేక్షకుడికి కూడా గత చిత్రం తాలుకా సంఘటనలు గుర్తుచేసేలా ఉంటాయి. ఇక సినిమా విషయానికొస్తే.. ఫస్టాఫ్‌ అంతా బావ మరదళ్ల టామ్‌ అండ్‌ జెర్రీ పోరాటమే నడుస్తూ నెమ్మదిగా సాగుతుంది. ఈ క్రమంలో మనవడిపై హత్యాప్రయత్నాలు జరగడంతో.. మనవడి జీవితాన్ని కాపాడడానికి సత్తెమ్మ, బంగార్రాజు భూమ్మీదకు వచ్చిన తర్వాతే కథలో వేగం పెరుగుతుంది. భూమ్మీదకు వచ్చిన బంగార్రాజు.. చిన్నబంగ్రారాజు శరీరంలోకి ఆత్మగా చేరి, బావా మరదళ్ల మధ్య ప్రేమ చిగురించేలా చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలో 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా మాదిరిగా హాస్య సన్నివేశాలు చాలా తక్కువ. కామెడీ లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఇక చిరవలో నాగచైతన్య, నాగార్జున కలిసి చేసిన యాక్షన్‌ సీన్లు ఆకట్టుకుంటాయి. చివరి 30 నిమిషాలు మాత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మొత్తం మీద 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా లెవల్‌లో బంగార్రాజు కూడా ఉంటుందని ఆశించి థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. కాకపోతే సంక్రాంతి బరిలో ఏ సినిమాలు లేకపోవడం.. అదీ నాగర్జున సినిమా కావడంతో.. థియేటర్‌కి వెళ్లి పండుగ సందర్భంగా ఓసారి చూసి రావచ్చనిపిస్తుంది.

312


ఎవరెలా చేశారంటే..
'సోగ్గాడే చిన్నినాయన'లో చిత్రంలో నాగార్జునే డ్యుయల్‌ రోల్‌ చేసి మెప్పించాడు. 'బంగార్రాజు'లో మనవడిగా నాగచైతన్య పరిచయమ్యాడు. అయితే నాగచైతన్య.. నాగార్జున మాదిరిగా చేయలేకపోయాడనే విషయం సినిమా చూస్తే స్పష్టంగా అర్థమౌతుంది. అంటే రొమాన్స్‌ సన్నివేశాల్లో కానీ, యాక్షన్‌ సీన్లలో కూడా ప్రధానంగా నాగార్జునే హైలెట్‌ అయ్యాడు. నాగచైతన్య నటన పేలవంగా ఉందనిపిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే.. ఆత్మగా నాగార్జున చేసే సన్నివేశాలే సినిమాకు ప్లస్‌ అని చెప్పుకోవచ్చు. ఇక రమ్యకృష్ణ తన నటనా అనుభవమంతా ఈ చిత్రంలో కనిపించింది. ఊరి సర్పంచ్‌గా హీరోయిన్‌ కృతిశెట్టి నటన కూడా సో సోగా అనిపిస్తోంది. 'ఉప్పెన', శ్యామ్‌సింగరారు' సినిమాల్లా అంత పవర్‌ఫుల్‌ ఫ్రేమ్‌గా ఆమె నటన లేదనిపిస్తోంది. ఇక రావురమేష్‌, సంపత్‌ జీపీ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. యముడిగా నాగబాబు పరఫెక్ట్‌ అనిపించింది. అలాగే వెన్నెల కిషోర్‌..తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ఇక ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం పరవాలేదనిపిస్తోంది. యువరాజ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ కథ మరింత బలంగా, కథనాన్ని ఆసక్తికరంగా సాగించినట్లయితే సినిమా ఇంకా బాగుండేదనిపిస్తోంది.

123