
న్యూఢిల్లీ : బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బిఒఐ) గత 27 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి భారీగా వడ్డీ రేట్లు పెంచింది. ద్రవ్యోల్బణం ముప్పు, అధిక ధరలు, ఇంధన ధరలు తదితర ఆందోళనల నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లను 1.25 నుంచి 1.75 శాతానికి చేర్చింది. హెచ్చు ధరలను కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పెట్టుబడిదారుల అంచనాలకు అనుగుణంగానే బిఒఐ గవర్నర్ ఆండ్రూ బెయిలీ 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేట్ల పెంపును ప్రకటించారని నిపుణులు పేర్కొంటున్నారు. 1995 తర్వాత ఇదే అతిపెద్ద పెంపు కావడం విశేషం. బ్రిటన్లో ఆహార, ఇంధన ధరల సంక్షోభంతో జూన్లో అక్కడి ద్రవ్యోల్బణం 9.4 శాతానికి ఎగిసి 40 ఏళ్ల గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది.
నేడు ఆర్బిఐ నిర్ణయం..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మానిటరింగ్ పాలసీ కమిటీ ద్రవ్య సమీక్షా నిర్ణయాలను గురువారం వెల్లడించనుంది. నేటితో ముగియనున్న మూడు రోజుల ఈ సమీక్షలో మరోసారి కీలక వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గడిచిన మే నెలలో 40 బేసిస్ పాయింట్లు, జూన్లో 50 బేసిస్ పాయింట్ల చొప్పున రెపోరేటును పెంచిన విషయం తెలిసిందే. దీంతో రెపోరేటు 4.9 శాతానికి చేరింది. ఆర్బిఐ మరోసారి వడ్డీ రేట్లు పెంచొచ్చనే అంచనాలతో గురువారం స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. వరుసగా ఆరు సెషన్లలో లాభాల్లో సాగిన సెన్సెక్స్ 52 పాయింట్లు కోల్పోయి 58,298 వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్లు తగ్గి 17,382 వద్ద నమోదయ్యింది.