May 14,2022 08:53

డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గును సరఫరా చేయలేమని కేంద్రం చేతులెత్తేసింది. కావాలంటే అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గును కొనుగోలు చేసుకోమని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. నేడు దేశంలో అనేక రాష్ట్రాల్ని బొగ్గు కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాంతో ప్రయివేటుగా అధిక ధర చెల్లించి రాష్ట్రాలు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి వస్తోంది. గత ఏడాది కూడా బొగ్గు కొరత దేశాన్ని కుదిపేసింది. ఆ అనుభవాల నుంచి పాఠాల్ని నేర్చుకోని కేంద్రం..సమస్య పట్ల అదే నిర్లిప్తత, నిర్లక్ష్యం కనబరుస్తోంది. దీని ఫలితం..నేడు రాష్ట్రాలు అనుభవిస్తున్నాయి.

  • అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు చేసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశం
  • రాష్ట్రాలపై మోయలేని భారం

న్యూఢిల్లీ : బొగ్గు ఎక్కడైనా కొనుక్కోండి.. పోండి..అంటూ మోడీ సర్కార్‌ రాష్ట్రాలను కసురుకుంటోంది. విద్యుత్‌ కోతలు పెరిగితే..ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని, ఆదాయం గణనీయంగా పడిపోతుందని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. బొగ్గు కొరతపై పది రోజుల క్రితం కేంద్రం రాసిన లేఖతో ఏం చేయాలో రాష్ట్రాలకు దిక్కుతోచటం లేదు. ''మీకున్న మొత్తం బొగ్గు అవసరాల్లో..10శాతం అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు చేసుకోండి. తద్వారా మీ బొగ్గు సమస్యను పరిష్కరించుకోండి'' అన్నది ఆ లేఖలో సారాంశం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని 'ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజనీర్స్‌ ఫెడరేషన్‌' (ఏఐపీఈఎఫ్‌) తీవ్రంగా ఖండించింది. బొగ్గు దిగుమతలపై రాష్ట్రాల జెన్‌కో (విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు)లకు ఇచ్చిన మార్గదర్శకాలు, ఆదేశాల్ని వెనెక్కి తీసుకోవాలని ఏఐపీఈఎఫ్‌ డిమాండ్‌ చేసింది.
 

ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలు మునుగుతాయి : ఏఐపీఈఎఫ్‌
అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి బొగ్గును కొనుగోలు చేయటమన్నది జెన్‌కోలకు సంబంధం లేని వ్యవహారం. అది నాణ్యమైన బొగ్గా..కాదా? ఎంత ధర పెట్టాలి? ఎంత పరిణామంలో కొనాలి? వాటి దిగుమతి ఛార్జీలు, రవాణా, ఇతర సుంకాలు..ఇలా అనేక విషయాలు జెన్‌కో తేల్చలేదు.
దిగుమతి ద్వారా బొగ్గు సేకరించే అనుభవం జెన్‌కోలకు లేదు. దాంతో కొనుగోలు చేయడానికి ముందుకువెళ్తే మోసపోయే అవకాశమే ఎక్కువ. వేసవి సమయం కాబట్టి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని అమ్మకం దార్లు చెప్పినట్టు ఆడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలోకి రాష్ట్రాలను నెట్టకూడదు. బొగ్గు కొరతను ఎదుర్కొనే పద్ధతి ఇది కాదు.
 

తప్పదు అనుకుంటే..
కొరతను ఎదుర్కొనేందుకు మరో మార్గం లేదనుకుంటే..దిగుమతి కారణంగా పడే అదనపు భారం కేంద్రమే భరించాలి. రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని ఏఐపీఈఎఫ్‌ అభిప్రాయపడింది. దిగుమతుల ద్వారా సేకరించుకోవాలని రాష్ట్రాలపై ఒత్తిడి తేవొద్దని ఏఐపీఈఎఫ్‌ చైర్మెన్‌ శైలేంద్ర దూబే కేంద్ర విద్యుత్‌ మంత్రికి లేఖ రాశారు. సమస్య పరిష్కారం కోసం కేంద్రంతో వెంటనే చర్చలు జరపాలని రాష్ట్రాల సీఎంలను ఆయన కోరారు.
 

కేంద్రం వైఫల్యం వల్లే ఇదంతా..
మనదేశంలో బొగ్గు గనులు అపారంగా ఉన్నాయి. బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు గనుల తవ్వకాల్ని ప్రయివేటుకు, కార్పొరేట్‌కు అప్పజెపుతున్నామని సమాధానమిచ్చిన మన పాలకులు, ఇప్పుడు కొరత ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పలేకపోతున్నారు. రైల్వే శాఖకు, గనుల శాఖకు సమన్వయం లోపించటమూ సమస్యను పెంచిందని విమర్శలున్నాయి. సరిపోయినన్ని రైల్వే వ్యాగన్లు లేక బొగ్గు రవాణా స్తంభించిపోయిందన్న వాదన ఉంది. ప్రతి రోజూ బొగ్గు రవాణాకు 441 రైల్వే వాగన్లు అవసరంకాగా, రైల్వే శాఖ 405వ్యాగన్లు సమకూరుస్తోంది. మొత్తంగా బొగ్గు సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వ సన్నద్ధత లోపించింది. విధానపరంగా అనేక తప్పులు ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఏఐపీఈఎఫ్‌ ఆరోపించింది.
 

వేల కోట్లు ఏమవుతున్నాయి..
కోల్‌ ఇండియా ద్వారా కేంద్రానికి 2016లో రూ.35వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నిధులతో కొత్త గనుల తవ్వకం చేపట్టవచ్చునని, ప్రస్తుతం ఆపరేషన్‌లో ఉన్న గనుల వద్ద తవ్వకాల్ని విస్తరించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కోల్‌ ఇండియా సీఎండీ పోస్ట్‌ ఎన్నో ఏండ్లుగా ఖాళీగా ఉంది. నేడు దేశంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఎన్నో ఏండ్ల క్రితం నిర్మించినవి. ఇప్పుడు వీటికి దిగుమతి చేసిన బొగ్గు సరఫరా చేస్తే అనేక సమస్యలు వస్తాయని, థర్మల్‌ కేంద్రాల్లో బాయిలర్లలో విపరీతంగా వేడెక్కి, ట్యూబ్‌లు లీకయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.