Aug 05,2022 23:24

వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు రాము తదితరులు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
మహిళా కార్మికులకు రక్షణ కల్పించలేని బ్రాండ్స్‌ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.రాము డిమాండ్‌ చేశారు. బ్రాండిక్స్‌ సీడ్స్‌ గ్యాస్‌ లీకేజీపై ముద్రించిన పోస్టర్‌ను అచ్యుతాపురంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాండిక్స్‌ యాజమాన్యం మహిళా కార్మికుల ప్రాణాలతో చదగాటమాడుతుందని విమర్శించారు. ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సీడ్స్‌ కంపెనీలో విశ్వవాయువులు లీకై వందలాదిమంది మహిళా కార్మికులు అనారోగ్యాలకు గురయ్యారని తెలిపారు. రెండు నెలల వ్యవధిలో రెండు పర్యాయాలు గ్యాస్‌ లీక్‌ ప్రమాదాలు చోటుచేసకున్నాయని పేర్కొన్నారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయని చెప్పారు. లాభాలు సంపాదించడంపై ఉన్న శ్రద్ధ, కార్మికులకు రక్షణ కల్పించడంపై లేదన్నారు. ప్రమాదం జరిగినప్పుడు కమిటీలు వేయడం తప్ప పటిష్టమైన కార్యాచరణ చేపట్టలేదన్నారు. రోజుకో పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె.సోమునాయుడు, నాయకులు పి రాజు, రమణ, అప్పారావు, కె.శ్రీరామ్‌, లీలా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.