Jun 11,2021 22:01

బ్రహ్మసాగర్‌ రిజర్వాయర్‌

 కడపప్రతినిధి ఎట్టకేలకు బ్రహ్మసాగర్‌ రిజర్వాయర్‌ లీకేజీకి అడ్డుకట్ట పడనుంది. తాజాగా రాష్ట్ర జలనవరుల శాఖ ఇంజినీరింగ్‌ ఉన్నతా ధికారులు బ్రహ్మసాగర్‌ లీకేజీ పనుల మరమ్మతులకు సంబంధించిన రూ.48.68 కోట్లతో కూడిన పనులకు పాలనామోదం లభించింది. మూడేళ్ల కింద నుంచి బ్రహ్మసాగర్‌ లీకేజీ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. బ్రహ్మసాగర్‌ లీకేజీ పనులకు నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో జిల్లా తెలుగుగంగ ప్రాజెక్ట్సు ఇంజినీరింగ్‌ యంత్రాంగం టెండర్ల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. జూన్‌ మూడో వారంలోపు టెండర్లను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. టెండర్ల ఓపెన్‌ చేసిన అనంతరం అర్హులైన కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం కుదుర్చుని పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మాసంలోపు బ్రహ్మసాగర్‌ లీకేజీ పనులు దక్కించుకున్న కాంట్రాక్టు కంపెనీతో కన్స్‌ స్ట్రక్షన్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ డయాఫ్రమ్‌ వాల్‌ పనులను పూర్తి చేయడంపై జిల్లా ఇంజినీరింగ్‌ యంత్రాంగం దృష్టి సారించింది. బ్రహ్మసాగర్‌ లీకేజీ పనులకు సంబంధించి ఆనకట్టను తొలగించకుండా పోలవరం కాంక్రీట్‌ పనుల తరహాలో భూగర్భంలోనికి వెళ్లి కాంక్రీట్‌ పనులు చేపట్టాల్సి ఉంది. ఇటువంటి సాంకేతిక సామర్థ్యం కలిగిన కాంట్రాక్టు సంస్థలు టెండర్లలో పాల్గొని బిడ్‌ను దక్కించు కోవాల్సి ఉంది. బ్రహ్మంసాగర్‌ లీకేజీ పనుల్ని పూర్తి చేసిన అనం తరం పూర్తిస్థాయిలో 17.358 టిఎంసిల సామర్థ్యం కలిగిన నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా 1.3 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.