Jan 14,2022 21:42

 

  • ఆగని కోడి పందేలు
  • తొలి రోజు రూ.వంద కోట్లపైనే

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : హైకోర్టు హెచ్చరికలు, పోలీసుల ఆంక్షలు పనిచేయలేదు. బరిలు ధ్వంసం చేసినా, బైండోవర్‌ కేసులు పెట్టినా పందెంరాయుళ్ళు ఖాతరు చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం భారీ ఎత్తున కోడి పందేలు ప్రారంభమయ్యాయి. కోళ్లకుకత్తులు కట్టి మరీ పందేలు వేశారు. తొలి రోజునే వంద కోట్ల రూపాయలపైన బెట్టింగ్‌ జరిగినట్టు అంచనా. అకాల వర్షాల కారణంగా కూడా ఆటంకం కలుగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో టిడిపి, వైసిపి ఎమ్మెల్యేలు,నాయకులు స్వయంగా కోడి పందేల శిబిరాలను ప్రారంభించారు. పశ్చిమ గోదావరిలోనిసీసలిలో టిడిపి ఎమ్మెల్యే మంతెన వెంకటరామరాజు (ఉండి), ఆ నియోజకవర్గం వైసిపి ఇన్‌చార్జి గోకరాజు రామరాజు సంయుక్తంగా కోడి పందేల బరిని ప్రారంభించారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకుడు చింతమనేని ప్రభాకర్‌ కూడా పెద్ద ఎత్తున కోడి పందేలను నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి దుప్పలపూడిలో కోడి పందేలను ప్రారంభించారు. ఆ జిల్లాలో పలువురు ప్రజా ప్రతినిధులు, మంత్రుల అనుచరులు దగ్గరుండి మరీ పందేలు వేయించారు. కృష్ణాజిల్లా విజయవాడ, మైలవరం, నూజివీడు, తిరువూరు, కైకలూరు, గనువరం, పెనమలూరు, పామర్రు, మచిలీపటుం, పెడన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనూ భారీగా కోడి పందేలు నిర్వహించారు. పందేల నిర్వహణకు బాగా పేరుగాంచిన పశ్చిమ గోదావరిలో తొలి రోజునే రూ.80 కోట్లమేర పందేలు జరిగినట్లు సమాచారం. తూర్పు గోదావరిలోనూ రూ.10 కోట్ల వరకు పందేలు జరగ్గా, కృష్ణాజిల్లాలోనూ అంతేస్థాయిలో పందేలు జరిగినట్లు అంచనా. పెద్ద బరిలలో ఒక్కో పందెం రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పందేలు వేస్తుండగా, చిన్న బరిలలో ఒక్కో పందెం రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు వేస్తున్నారు. పందేలను దగ్గరుండి చూసేందుకుప్రత్యేకంగా గ్యాలరీను ఏర్పాటు చేశారు. లోపలకు ప్రవేశించేందుకురూ.100 నుంచి రూ.300 వరకు ప్రవేశ రుసుం వసూలు చేయగా, వాహనాల పార్కింగ్‌కు రూ.50 నుంచి రూ.100 వసూలు చేశారు.
విజయవాడ నడిబడ్డులోనూ
విజయవాడ నగర నడిబడ్డున సైతం కోడి పందేలు యథేచ్చగా నిర్వస్తున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌ పైపుల రోడ్డుకు దగ్గర్లో అంబాపురం గ్రామ పరిధిలో భారీ బరిని ఏర్పాటు చేశారు. నగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే సహకారంతో మూడు రోజులపాటు పందేలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇళ్ల మధ్యలోనే పందేలు వేస్తుండటంతో, స్థానికులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ, ఒక్క పోలీసు అధికారి కూడా అటువైపు కనొత్తి చూసినపాన పోలేదు. విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరు తాడేపల్లిలోనూ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే సహకారంతో భారీగా పందేలు వేస్తున్నారు. గనువరం నియోజవర్గంలోని అంపాపురంలోనూ భారీగా కోడి పందేలు జరిగాయి. ప్రజా ప్రతినిధులే పందేలు వేయిస్తుండటంతో పోలీసులు కేసులు నమోదు చేసేందుకు ధైర్యం చేయలేకపోయారు.
యథేచ్చగా గుండాట, పేకాట
కోడి పందేల శిబిరాల వద్ద గుండాట, పేకాట యధేచ్చగా జరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన నిర్వాహుకులు కోడి పందేల ఆర్గనైజర్లకు డబ్బులిచ్చి మరీ ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. కోడి పందేల బెట్టింగ్‌తో పోల్చితే గుండాట, పేకాటల్లోనే పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు సమాచారం. ఇక మద్యం ఏరులై పారింది. మద్యం అమ్మకాలకు అధికారికంగా అనుమతిలేనప్పటికీ, బెల్ట్‌ షాపుల నిర్వాహకులే పాయింట్లు తీసుకుని మద్యాన్ని విక్రయిస్తున్నారు.