Jun 01,2023 23:57

ప్రజాశక్తి-కాకినాడ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ను తక్షణం అరెస్టు చేయాలని కేంద్ర కార్మికసంఘాల ఆధ్వర్యంలో ఇంద్రపాలెంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, ఐఎన్‌టియుసి ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తాళ్లూరి రాజు, టిఎన్‌టియుసి నాయకులు రాజారావు మాట్లాడారు. 50 రోజులుగా ఢిల్లీ నడిబొడ్డున మహిళా మల్లయోధులు పోరాడుతున్నారని, హత్య, కిడ్నాప్‌, అత్యాచారం 38 కేసుల్లో వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, మోడీ ప్రభుత్వం కాపాడుతూ దేశానికి ప్రతిష్ట తెచ్చిన మహిళా రెజ్లర్లకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షునిగా ఉన్న బిజెపి ఎంపీ తన కుటుంబ పరివారాన్ని మొత్తం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌లో ఉన్నత స్థానాల్లో నియమించి తన కనుసన్నల్లో రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ నడిచేలా ఏర్పాటు చేసుకున్నాడని విమర్శించారు. మల్లయోధులకు ప్రపంచ రెజ్లింగ్‌ సమాఖ్య మద్దతు తెలియజేస్తూ తక్షణం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి ఎన్నికలు తక్షణం నిర్వహించని పక్షంలో ప్రపంచ పోటీల నుండి బహిష్కరిస్తామని హెచ్చరిక చేయడాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం మహిళల పట్ల, లైంగిక వేధింపులు పట్ల ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్‌, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడకొండ, ఎఐటియుసి నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, మహిళా సమాఖ్య నాయకురాలు లోవరత్నం, నగర అధ్యక్షులు జి.అన్నవరం, సెక్యూరిటీ గార్డ్‌ యూనియన్‌ నాయకులు రామయ్య, కాశీ విశ్వనాథ్‌, సిఐటియు నగర ఉపాధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు వేణి, నాగబత్తుల సూర్యనారాయణ, అమత, అభ్యద్‌, టిఎన్‌టియుసి నాయకులు రేవు సురేష్‌, కొప్పాడ సత్తిబాబు, మల్లవారపు రాజు, ఐఎఫ్‌టియు నాయకులు బంగారు సత్యనారాయణ, గరగా దుర్గబాబు, శ్రీపాదం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.