Sep 20,2023 00:36

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన మానవహారం చేస్తున్న విద్యార్థినులు

ప్రజాశక్తి-చోడవరం
మండలంలోని అన్నవరం బిసి బాలికల వసతి గృహం నుండి కొత్తూరు జంక్షన్‌ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యాన ఆ హాస్టల్‌ విద్యార్థినులు మంగళవారం స్థానిక కొత్తూరు జంక్షన్‌లో ఆందోళన చేపట్టారు. మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మామిడి రమణ, ఎస్‌.రమణ మాట్లాడుతూ ఈ హాస్టల్‌లో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 130 మంది విద్యార్ధినులు వసతి సౌకర్యం పొందుతున్నారని తెలిపారు. వీరంతా సుమారు 2 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న చోడవరం పట్టణంలోని గర్ల్స్‌ హైస్కూల్‌కు రోజూ నడుచుకుంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరు పుస్తకాలు, బ్యాగులు మోస్తూ సుమారు 5 కిలోమీటర్ల దూరం రోజూ నడవాల్సి వస్తోందన్నారు. సాయంత్రం సమయంలో ఈ దారిలో ఆకతాయిలు బెడద ఎక్కువగా ఉందని, మద్యం షాపులు, బార్‌లు వంటివి ఉండడంతో విద్యార్థినులను ఆకతాయిల వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సుమారు 40 మంది పిల్లలు టిసిలు తీసుకుని హాస్టల్‌ నుండి వెళ్లిపోయారని పేర్కొన్నారు. గతంలో బస్సు సౌకర్యం ఉండేదని, కరోనా తర్వాత బస్సు రాకపోకలను నిలిపివేశారని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని బడి బస్సును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. వీరి ఆందోళనకు డివైఎఫ్‌ఐ నాయకులు ఎస్‌వి.నాయుడు, సిఐటియు నాయకులు వివి శ్రీనివాసరావు, జి.వరలక్ష్మి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కామేష్‌, రమేష్‌, సుందర్‌, గాయత్రి, బి.మాధురీలత, వర్శిని, వెంకటలక్ష్మి, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.