Jul 30,2021 06:22

ఆశల పిట్టొకటి నా భుజంపై వాలింది.
తిరిగి చూసే లోపు తన రెక్కల చప్పుడును
నా చెవిని చేర్చి అందనంత ఎత్తుకు
ఎగిరిపోయింది.

చిరునవ్వులా...సీతాకోకచిలుక
ఆనందం అనే అందమైన వర్ణాలతో
ఎగిరొచ్చి మోముపై వాలింది.
చేతితో తాకే లోపు చేజారిపోయింది.

పావురాల గుంపొకటి...
శాంతి కపోతాలై
వాన మబ్బుల్లాంటి... స్నేహ బంధాలను
అల్లుకుంది.
వానై కురిసే లోపు...
బలమైన గాలి తాకుళ్లకు
బంధాలన్ని కనుమరుగై పోయాయి.

కోకిలమ్మ వినిపిస్తున్న కమ్మనైన రాగాల కంటే
కష్టాల కడలిలో చిక్కుకున్న బతుకు పాటలే
వినసొంపైన సరాగాలై వినిపిస్తున్నాయి.

ఒక్కో క్షణం ...ఒక్కో బాధ
నా గుమ్మం ముందు
వాలిపోతుంది.
ఇల్లంతా పరుచుకొని
నాతో పాటే జీవిస్తున్నాయి.
అవి నా స్నేహితులు...
నా దగ్గరకే వస్తాయి.
వాటికి నేనంటే చాలా ఇష్టం...
ఎందుకంటే నేను పేదోడ్ని కదా.

- అశోక్‌ గోనె
సెల్‌ : 9441317361