May 13,2022 22:10
  • 1,08,755 కుటుంబాలకు రూ.109 కోట్లు జమ

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, ఐ.పోలవరం : మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో 'వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా' నాల్గో విడత కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. బటన్‌ నొక్కి 1,08,755 మంది మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రూ.109 కోట్లు జమ చేశారు. ఒఎన్‌జిసి పైపులైను కారణంగా జీవనోపాధి కోల్పోయిన కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన 69 గ్రామాల్లోని 23,548 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.108 కోట్ల నష్టపరిహారాన్ని అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద గంగపుత్రులకు నాలుగేళ్లలో రూ.418.08 కోట్లు లబ్ధి కలిగిందన్నారు. పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలను దగ్గరగా చూశానని, ఈ మేరకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మత్స్యకారులకు అందిస్తున్న సాయాన్ని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచామన్నారు. 2014-15లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు మాత్రమే పరిహారం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. డీజిల్‌పై సబ్సిడీ రూ.6.30 నుంచి రూ.9కి పెంచామన్నారు. స్మార్ట్‌ కార్డులు జారీ చేసి డీజిల్‌ కొనేటప్పుడే సబ్సిడీ సొమ్ము మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. వేటకు వెళ్లి మత్స్యకారుడు ప్రమాదవశాత్తు చనిపోతే వచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు, నాలుగు ఫిషింగ్‌ ల్యాండింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వీటిలో నాలుగింటికి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఐదు టెండర్‌ దశలో ఉన్నాయని తెలిపారు. నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామన్నారు. 70 ఆక్వా హబ్‌లు, 14 వేల రిటైల్‌ దుకాణాల ఏర్పాటుకు శరవేగంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. వీటిద్వారా దాదాపు 80 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని తెలిపారు.
ఇలాంటి తండ్రిని ఎక్కడా చూడలేదు

  • చంద్రబాబు ఉద్దేశించి జగన్‌ వ్యాఖ్యలు

కొడుక్కి పచ్చి అబద్ధాలు, మోసాలతో శిక్షణ ఇస్తోన్న చంద్రబాబు లాంటి తండ్రిని ఎక్కడా చూడలేదని చంద్రబాబును ఉద్దేశించి జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. మంచి పనులు చేస్తుంటే, కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం తగదన్నారు. పరీక్ష పేపర్ల లీక్‌ను సమర్థిస్తోన్న, ఇఎస్‌ఐలో డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీల్లేదు అంటూ ప్రకటనలు గుప్పిస్తోన్న ప్రతిపక్షం, ఎల్లోమీడియాను ఎక్కడైనా చూశారా? అంటూ ప్రశ్నించారు. రాజకీయ నాయకుడు ప్రజలను నమ్ముకోవాలని పేర్కొన్నారు. మంత్రిగా పనిచేసి మంగళగిరిలో ఓడిన సొంతపుత్రుడు, రెండుచోట్లా ఓడిన దత్తపుత్రుడిని నమ్ముకుంటూ, 40 ఏళ్లు ఇండిస్టీ అంటూ గొప్పలు చెప్పులు చెప్పుకుంటూ ఉండడం సరికాదని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. గత ప్రభుత్వానికీ, ఈ ప్రభుత్వానికీ తేడాను ప్రజలే గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదరి అప్పలరాజు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌, సమాచార శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపిలు చింతా అనురాధ, వంగా గీత, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కురసాల కన్నబాబు, కొండేటి చిట్టిబాబు, పెండెం దొరబాబు, రాపాక వరప్రసాద్‌ పాల్గొన్నారు.