Jan 17,2022 18:54

పునాది ఎంత ధృడంగా ఉంటే దాని మీద కట్టే ఇల్లు కూడా అంతే గట్టిగా ఉంటుందని బ్యాడ్మింటన్‌ తస్నిమ్‌ మిర్‌ ఆటను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఆమె బ్యాట్‌ పట్టుకుని కోర్టులోకి దిగితే ఎదుటివారి ఎత్తులను చిత్తు చేస్తూ...రాకెట్‌ కన్నా వేగంగా దూసుకుపోతుంది. తండ్రి శిక్షణలో బాల్యం నుంచి కఠోర శ్రమతో నేర్చుకుంది. అందుకే పదహారేళ్లకే అండర్‌-19 ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో అమ్మాయిల సింగిల్స్‌ విభాగంలో టాప్‌ ర్యాంక్‌ను తన సొంతం చేసుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలీగా నిలిచారు.
గుజరాత్‌లోని మెహసానాకి చెందిన తస్నిమ్‌ మిర్‌, తండ్రి ఇర్ఫాన్‌ మిర్‌ని చూసి ఈ ఆట పట్ల ఇష్టం పెంచుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఇర్ఫాన్‌ ప్రతిరోజూ బ్యాడ్మింటన్‌ ఆడేందుకు గ్రౌండ్‌కి వెళతారు. జూనియర్స్‌కి శిక్షణ ఇస్తుంటారు. తనతో పాటు తస్నిమ్‌ని కూడా తీసుకుని వెళ్లేవారు. అక్కడ క్రీడాకారులను చూస్తూ...పెరిగిన తస్నిమ్‌ ఆట పట్ల ఆసక్తి పెంచుకున్నారు. బ్యాట్‌ పట్టుకుని ఆడేందుకు ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అలా ఆరేళ్ల వయస్సు నుంచి తండ్రి వద్ద బ్యాడ్మింటన్‌లో శిక్షణ ప్రారంభించారు. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఎనిమిది గంటలు ఆటను సాధన చేసేవారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తట్టుకుని ఆటని ఆడారు. భాష రాకపోయినా ప్రపంచ దేశాల సీనియర్‌ క్రీడాకారుల పోటీలను కూడా తరచూ చూస్తుంటారు.
సైనా, సింధులే స్ఫూర్తి
ఇప్పటి వరకూ మనదేశంలో బ్యాడ్మింటన్‌లో సత్తాచాటిన సైనా నెహ్వాల్‌, పీవీ సింధులే ఆమెకి స్ఫూర్తి. వారి ప్రతి ఆటను గమనిస్తూ పెరిగారు. పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడే జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్‌ ఆటల్లో పాల్గని సత్తా చాటారు. ప్రతి రోజూ ఆరు, ఏడు గంటలు సాధన చేసి, ఎప్పటికప్పుడు ఆటతీరులో మెలకువలు నేర్చుకునేవారు. శరీర ధృడత్వంతో పాటు మానసిక ఆనందం కూడా ముఖ్యమని గ్రహించి ఆ దిశగా శిక్షణ కొనసాగించారు. తన ప్రతి షాట్‌ని ఓ సవాల్‌గా, ఆత్మవిశ్వాసం పెంచుకుంటూ డబుల్స్‌ ఆటపై సాధన చేశారు. కనురెప్ప పాటులో ప్రత్యుర్థుల అంచనాలను పసిగట్టి తన ఆటను ఆడేవారు. ఆమె కోర్టులో చురుకుదనం చూసి క్రీడాభిమానులు ఆశ్చర్యచికితులై చూస్తుంటారు. ఇప్పటి వరకూ అండర్‌-13, అండ్‌, 15, అండర్‌-19 అమ్మాయిల సింగిల్స్‌ విభాగంలో ఆడి 22 టైటిళ్లును సాధించారు. 14 ఏళ్ల వయస్సులో బ్యాడ్మింటన్‌లో ఇప్పటివరకు ఎవరూ ఆడని ఆటని ఆడి 'అండర్‌-19 జాతీయ జూనియర్‌ ఛాంపియన్‌'గా నిలిచారు. 2011లో ప్రవేశ పెట్టిన అండర్‌-19 బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో.. అప్పట్లో సింధు రెండో ర్యాంకు కైవసం చేసుకోగా.. సైనా అప్పటికే జూనియర్‌ స్థాయి దాటిపోయింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా తస్నిమ్‌ నిలిచారు. సాధన పెంచుకుంటూ పోటీలో ఎక్కడా తగ్గకుండా డబుల్స్‌ విభాగంలోనూ సత్తా చాటుతున్నారు. 2016లో నేషనల్స్‌లో పి. గోపీ చంద్‌ అకాడెమీకి చెందిన మెహగానా రెడ్డిపై విజయం సాధించారు. దీంతో హైదరాబాద్‌ అకాడెమీలో మరింత శిక్షణ పొందాలనే ఆసక్తి ఆమెకి కలిగింది. తల్లిని తీసుకుని హైదరాబాద్‌ అకాడెమీలో కొన్ని నెలలు ట్రైనింగ్‌ తీసుకున్నారు.
లాక్‌డౌన్‌లో చదవుకుంటూనే..
కరోనా లాక్‌డౌన్‌ వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమయం వృథా చేయకుండా ఇంట్లోనే బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ శిక్షణా సెషన్‌ నుంచి పాఠాలు విన్నారు. ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా చదువులపై దృష్టి పెట్టిన ఆమె ఎప్పుడైనా పరీక్షలు రాసేలా పాఠశాల ఉపాధ్యాయులు అవకాశం కల్పించారు. తోటి స్నేహితులు కూడా సహాయం అందించారు. అలా ఆమె చదువుకుంటూనే ఆట సాధన చేశారు. బల్గేరియా, ఫ్రాన్స్‌, బెల్జియంలో నిర్వహించిన కీలక పోటీల్లో పాల్గని మూడు బహుమతులు గెలిపొందారు.
ఆట తీరు మెరుగుపరచుకుంటూ..
ప్రతిసారీ బ్యాడ్మింటన్‌లో ఎదురైయ్యే ప్రతిసవాళ్లను ఎదుర్కునేలా ఆట సాధన చేస్తూ వచ్చారు తస్నిమ్‌. సింగిల్స్‌, డబుల్స్‌ పోటీల తర్వాత పురుషులతో ఆటను ఆడాలనుకున్నారు. కోచ్‌తో మాట్లాడి గత నాలుగేళ్లుగా గుహవటిలోని 'అసోం బ్యాడ్మింటన్‌ అకాడెమీ'లో శిక్షణ తీసుకుంటున్నారు. అక్కడ పురుష క్రీడాకారులతో సాధన చేస్తూ, ఆట తీరు మార్చుకుంటూ...తనను తాను మెరుగు పరచుకుంటున్నారు.. 'ప్రస్తుతం ఇండోనేషియా కోచ్‌ ఎడ్విన్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు.
అమ్మ, నాన్న త్యాగాల ఫలితం
'నాన్న ఇచ్చిన ట్రైనింగ్‌ నన్ను ఇక్కడ వరకూ తీసుకువచ్చింది. అమ్మ, నాన్నలు నా కోసం చాలా త్యాగాలు చేశారు. నా కోచింగ్‌ కోసం శ్రమ పడ్డారు. నా వెన్నంటే ఉండి నన్ను అన్ని విధాల ప్రోత్సహించారు. ఒక పక్క ఆటల్లో పాల్గంటూనే చదువుకుంటున్నా. కోవిడ్‌ ప్రభావం టోర్నమెంట్లపై పడినా అధైర్యపడలేదు. కఠిన శ్రమ, మానసిక దృఢత్వం ప్రశాంతంగా ఉండేలా చేసింది. అదే నన్ను పోటీల్లో పాల్గని మూడు టైటిళ్లు గెలిచేలా చేసింది' అంటోందీ ఈ యువ బ్యాడ్మీంటన్‌.

బ్యాడ్మింటన్‌లో నెంబర్‌ వన్‌
ఇప్పుడు ప్రకటించిన అండర్‌-19 ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో అమ్మాయిల సింగిల్స్‌ విభాగంలో టాప్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న తస్నీమ్‌పై దేశ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.