
ప్రజాశక్తి నిమ్మనపల్లి : సప్తగిరి గ్రామీణ బ్యాంకులను ఆదాయ వనరులుగా ఖాతాదారులు ఎంచుకోవాలని బ్యాంకు ఎఫ్ఎల్సి జిల్లా కో-ఆర్డినేటర్ ఎన్.ఎస్.మధుసూదనరావు అన్నారు. శనివారం స్థానిక బస్టాండ్‌లోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద బ్యాంకు ఖాతాదారులతో సమావేశం నిర్వహించి 'ఆర్థిక అక్షరాస్యత-ఖాతాదారుల బాగోగులు' అనే అంశంపై ఎం.వి రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళాజాత బృందం ద్వారా ఆట, పాటలతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డ్ వారి సహకారంతో గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు ఖాతాదారులకు బ్యాంకులోని పథకాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఖాతాను కలిగిన వారు కేవలం లావాదేవీలే కాకుండా, బ్యాంకులను ఇతర ఆదాయ వనరులుగా ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. బ్యాంకు ద్వారా అనేక విధమైన రుణ సదుపాయాలు, కేంద్ర పథకాలు, ఇన్సూరెన్స్‌లను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఖాతాదారులు ఆర్థిక పరిపుష్టిని సాధించడానికి, వ్యాపార సౌలబ్యానికి బ్యాంకులలోని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో నిమ్మనపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ హరిత, క్యాషియర్ రాఘవేంద్రరెడ్డి, ఎన్.వి.రూరల్ కళాజాత బృందం సభ్యులు మహేష్, శేషు, జైనూల్, సుధాకర్ పాల్గొన్నారు.