
కోల్‌కతా : నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఎక్కడ, ఎటువంటి భూమిని ఆక్రమించలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రకటించారు. భూమికి సంబంధించిన పత్రాలను ఆమె సోమవారం నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌కు అప్పగించారు. భవిష్యత్తులో ఆయనను ఎవరూ ప్రశ్నించకుండా భూమి పత్రాలు అప్పగించినట్లు తెలిపారు. అధికారులు, రికార్డులను తనిఖీ చేసిన తర్వాత, విశ్వ భారతి ఆరోపించినట్లుగా సేన్ ఎటువంటి భూమిని ఆక్రమించలేదని సిఎం గుర్తించామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
సోమవారం మధ్యాహ్నం బోల్పూర్ చేరుకున్న మమతా బెనర్జీ అమర్త్యసేన్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆయనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని అన్నారు. ఆయన ప్రతిష్టను దిగజార్చేందుకు చేస్తున్న ప్రయత్నమని, ఆయనను అవమానించే హక్కు ఎవరికీ లేదని, సహించబోమని అన్నారు. కోల్‌కతాకు తిరిగి చేరుకున్న తర్వాత చట్టపరమైన చర్యలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తామని ప్రకటించారు. చట్టవిరుద్ధంగా భూమిని అనధికారికగా ఆక్రమించారంటూ అమర్త్యసేన్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. శాంతినికేతన్‌ను కాషాయీకరణ చేయడానికి యత్నిస్తున్నారని యూనివర్శిటీ అధికారులపై విరుచుకుపడ్డారు. తనకు విశ్వభారతి పట్ల అపారమైన గౌరవం ఉందని, అయితే ప్రభుత్వానికి సంబంధం లేకుండా సెంట్రల్ యూనివర్శిటీ వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగించిందని అన్నారు. సేన్‌ను అవమానించే హక్కు ఆయనకు లేదని, విశ్వభారతి వైస్ ఛాన్సలర్ బిద్యుత్ చక్రవర్తి ఆ పదవికి అర్హులా అని ప్రశ్నించారు.