
కోల్‌కతా : ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో మరో టిఎంసి నేత సుజయ్ కృష్ణ భద్రను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అదుపులోకి తీసుకుంది. పశ్చిమబెంగాల్‌లోని వివిధ ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో జరిగిన అక్రమ నియామకాలకు సంబంధించి సుజయ్ కృష్ణను మంగళవారం రాత్రి ఈడి అరెస్ట్ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. కాళీఘాట్ అంకుల్‌గా సుపరిచుతులైన ఆయనను మంగళవారం రాత్రి 12 గంటల పాటు ప్రశ్నించిందని, అనంతరం అదుపులోకి తీసుకుందని అన్నారు. విచారణ సమయంలో ఆయన అధికారులకు సహకరించలేదని, అందుకే అదుపులోకి తీసుకున్నామని ఈడి మీడియాకి తెలిపింది. భద్ర గతవారం ఈడి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో గతంలో రెండు సార్లు సిబిఐ విచారణకు కూడా హాజరయ్యారు.
తమ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ రాజకీయ కథనం నుండి దృష్టి మళ్లించడంలో ఈ అరెస్ట్ ఒక భాగమని టిఎంసి అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ విమర్శించింది. ఈ కేసుకు సంబంధించి పశ్చిమబెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీని ఇప్పటికే ఈడి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టిఎంసి ఎమ్మెల్యే జిబాన్ కృష్ణా సాహా, పశ్చిమబెంగాల్ ప్రాథమిక విద్య మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్యలను కూడా సిబిఐ అరెస్ట్ చేసింది.