Sep 15,2021 23:47

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈ నెల 27న జరిగే భారత్‌ బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని మాజీ మంత్రి, అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ నెల 27న భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ఆధ్వర్యంలో సన్నాహక సదస్సు ఒంగోలు ఆచార్య రంగా భవన్‌లో బుధవారం జరిగింది. తొలుత హరియాణాలో పోలీసుల లాఠీఛార్జిలో మృతిచెందిన సుశీల్‌ కాజల్‌కు సదస్సు మౌనం పాటించి.. నివాళులర్పించింది. సదస్సుకు ఏఐకెఎస్‌సిసి జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ నల్ల చట్టాల రద్దు, విద్యుత్‌ సవరణచట్టం 2020 రద్దు కోరుతూ 10 నెలలుగా రైతాంగం ఉద్యమాన్ని కొనసాగిస్తోందన్నారు. ట్రూ అప్‌ చార్జీల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపుతుంటే మోడీ, అమిత్‌ షా మెప్పు కోసం రాష్ట్రంలో సిఎం జగన్‌ ట్రూ అప్‌ ఛార్జీల బాదుడుకు పూనుకున్నారన్నారు. ఈ విషయమై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించాలని, భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించాలని కోరారు. అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 27న జరిగే భారత్‌ బంద్‌ను జిల్లాలో విజయవంతం చేయాలన్నారు.
20 నాటికి సదస్సులు పూర్తి చేయాలి
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకెళ్ళాలని, మండల స్థాయి సదస్సులు ఈ నెల 20 లోపు పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.కేశవరావు పేర్కొన్నారు. భారత్‌ బంద్‌ చేపట్టడానికి కారణాలను గ్రామాలలో ముఖ్యంగా బిసి, ఎస్‌సి, ఎస్‌టి కాలనీలలో ప్రచారం చేయాలన్నారు. మండ లాలలో బైక్‌ ర్యాలీలు, ప్రచార క్యాంపెయిన్‌ చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యుత్‌ చట్టం అమలులోకి వస్తే రూ.130 కోట్ల ప్రజలకు నష్టమన్నారు. నిత్యా వసరాల చట్టం అమలులోకి వస్తే కార్పొరేట్‌ శక్తులు ఇష్టారీతిన ధరలను పెంచుకొనే ప్రమాదం ఉందన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతాంగ ఉద్యమం చారిత్రాత్మకమైందని, ఎందరో రైతులను కోల్పోయినా పోరాటం కొనసాగుతుందన్నారు. భారత్‌ బంద్‌లో కార్మిక సం ఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సదస్సులో అఖిల రైతుకూలి సంఘం రాష్ట్రఅధ్యక్షులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు వి.రాజగోపాల్‌రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జాలా అంజయ్య, కార్యదర్శి కంకణాల ఆంజ నేయులు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.బాలకోటయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి వడ్డె హనుమారెడ్డి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌.లలితకుమారి, అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు కె.నాంచార్లు, ఎంఎస్‌ సాయి, ఆచార్య రంగా కిసాన్‌సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య, తెలుగు రైతు బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు కొండ్రగుంట వెంకయ్య, ఏఐటియుసి జిల్లా నాయకులు ఎస్‌డి సర్ధార్‌, బహుజన విజ్ఞాన కేంద్రం మిరియం అంజిబాబు, ఓపిడిఆర్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావలి సుధాకర్‌ రావు, రైతునాయకులు వేజండ్ల రామారావు, విద్యార్థి జెఎసి రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్‌, ఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు కె.శరత్‌ బాబు, డాక్టర్‌ ఆర్‌.ప్రసాద్‌, ఆర్‌మోహన్‌, దాసరి సుందరం, రైతులు పాల్గొన్నారు.