Feb 22,2021 20:42

న్యూఢిల్లీ : భారత్‌, చైనా సరిహద్దుల్లో సైన్యాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో తొమ్మిది మాసాల తర్వాత తొలిసారి ఇరు దేశాల మధ్య తత్సంబంధాలు నెలకొంటున్నట్లు స్పష్టమైన సంకేతాలు వస్తోన్నాయి. ఇందుకు నిదర్శనం చైనాకు చెందిన పెట్టుబడులకు భారత్‌ పచ్చజెండా ఊపడమే. సుమారు 45 చైనా సంస్థల నుంచి పెట్టుబడుల పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. ఇందులో గ్రేట్‌ వాల్‌, ఎస్‌ఎఐసి సంస్థల ప్రతిపాదనలు ఉన్నాయని సమాచారం. ఉత్పాదక రంగానికి సంబంధించిన పెట్టుబడులకు త్వరితగతిన ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్‌లో 250-300 మిలియన్ల డాలర్ల విలువ గల అమెరికా కార్ల ప్లాంట్‌ను కొనుగోలు చేస్తామని గ్రేట్‌ వాల్‌, జనరల్‌ మోటార్స్‌ సంయుక్త ప్రతిపాదనలను అందజేశాయి. రాబోయే ఐదు సంవత్సరంలో భారత్‌లో 100 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టాలని గ్రేట్‌ వాల్‌ మోటార్స్‌ భావిస్తోంది. దీనిపై స్పందించడానికి కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి నిరాకరించారు. తమ ప్రతిపాదనలను ఆమోదించాలని భారత ప్రభుత్వాన్ని నిరంతరం కోరుతూనే ఉంటామని గ్రేట్‌వాల్‌, జనరల్‌ మోటార్స్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఎస్‌ఎఐసి 2019 నుంచే భారత్‌లో బ్రిటిష్‌ బ్రాండ్‌ ఎంజి మోటార్‌ 400 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టడంతో పాటుగా అమ్మకాలను ప్రారంభించింది.