Nov 19,2020 20:43

న్యూఢిల్లీ : వచ్చే ఐదేళ్లనూ భారత వృద్ధి రేటు అంతంత మాత్రంగానే ఉండనుందని అంతర్జాతీయ విశ్లేషణ సంస్థ అక్స్‌ఫర్డ్‌ ఎకానమిక్స్‌ పేర్కొంది. ఇంతక్రితం వేసిన తన అంచనాలను తాజాగా సమీక్షించింది. మధ్యస్త కాలం 2020- 25లో భారత జిడిపి సగటున కేవలం 4.5 శాతం పెరుగొచ్చని అక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ తన తాజా పరిశోధన పత్రంలో పేర్కొంది. ఇంతక్రితం 6.5 శాతంగా ఉండొచ్చని తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచ పరిస్థితి అత్యంత దుర్బరంగా తయారయ్యిందని విశ్లేషించింది.
         మధ్యస్థకాలానికి భారత జిడిపి కూడా పేలవంగా నమోదు కానుందని తెలిపింది. ఇది వరకు తమ అంచనా కంటే వచ్చే ఐదేళ్లలో తలసరి ఆదాయం 12 శాతం తక్కువగా నమోదు కానుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపనలు, పలు పథకాలు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొంది. అయితే ఇతర దేశాలతో పోల్చితే భారత్‌ కాస్తా వేగంగా అభివృద్ది చెందనుందని అంచనా వేసింది.

భారత వృద్థి రేటుకు కోతలు.. 2020-25లో 4.5 శాతమే : ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ అంచనా
          కరోనా సంక్షోభానికి తోడు కార్పొరేట్‌ కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లలో ఒత్తిడి, బ్యాంకుల్లో మొండి బాకీలు పెరగడం, బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్‌బిఎఫ్‌సి)లు బలహీనంగా మారడం, కార్మికుల మార్కెట్‌ పేలవంగా ఉండటం తదితర అంశాలు ప్రస్తుత ఏడాదిలో వృద్థి రేటును దెబ్బతీయనున్నాయని పేర్కొంది. ప్రస్తుత ఏడాదిలో ప్రపంచ వృద్ధి రేటు 2.5 శాతం పెరుగుదల ఉండొచ్చని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ అంచనా వేసింది. ప్రయివేటు పెట్టుబడులు పెరిగితే తిరిగి సూక్ష్మ గణంకాలు బలపడొచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు మైనస్‌ 10.6 శాతానికి పడిపోవచ్చని మూడీస్‌ మరో రిపోర్ట్‌లో అంచనా వేసింది. ఇంతక్రితం ఈ అంచనాలు మైనస్‌ 11.5 శాతంగా ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు పథకాలు తయారీ రంగం, ఉపాధి కల్పనకు దోహదం చేయడం ద్వారా దీర్ఘకాలంలో వృద్థి కొంత పుంజుకోవచ్చని తెలిపింది.